హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో యూరియా కోసం రైతులు గోస పడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని గ్రామీణ పేదల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పడిగ ఎర్రయ్య, గన్నెబోయిన వెంకటాద్రి మండిపడ్డారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. వ్యవసాయ సహకార సంఘాల గోదాంల ఎదుట రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నా ప్రభుత్వం కనికరించడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. సకాలంలో యూరియా వేయకపోతే పంట దిగుబడి తగ్గి, రైతులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు.
గత పదేండ్లకాలంలో ఏనాడూ పోలీసుల పహారాలో యూరియా అందించలేదని, కానీ ప్రస్తుతం పోలీసులను కాపలా పెట్టి యూరియా అందించాల్సిన దుర్భర పరిస్థితులు దాపురించాయని ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందుచూపు లేని కారణంగానే రైతులు గోస పడుతున్నారని విమర్శించారు. ఆరు గ్యారెంటీలు దేవుడెరుగు, కనీసం యూరియాను కూడా ఇచ్చే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రైతులు చేస్తున్న ఆందోళనలకు తమ సంఘం మద్దతు ఇస్తుందని స్పష్టంచేశారు. ఇప్పటికైనా రైతులకు సరిపడా యూరియాను అందించాలని డిమాండ్ చేశారు.