మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘అధికారం మాదే.. మేము చెప్పినట్టే అందరూ నడుచుకోవాలి.. ఏది చెబితే అదే చేయాలి.. లేదంటే మంత్రి జూపల్లి కృష్ణారావుతో చెప్పి అధికారులను దూర ప్రాంతాలకు బదిలీ చేయిస్తాం.. గ్రామంలో జరిగే అభివృద్ధి కార్యక్రమానికి దళిత సర్పంచ్‌ను ఆహ్వానించాల్సిన అవసరం లేదు’ అంటూ ఉప సర్పంచ్ హుకుం జారీ చేసిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా.. మంత్రి ఇలాకాలో చోటుచేసుకున్నది. పెద్దకొత్తపల్లి మండలం కల్వకోలులో పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుదారుడు శ్రీనివాస్ సర్పంచ్‌గా గెలుపొందారు. నాటి నుంచి దళిత సర్పంచ్‌ను కాంగ్రెస్ నాయకులు అవమానిస్తున్నట్టు సమాచారం. సర్పంచ్‌కు తెలియకుండా.. గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండానే కాంగ్రెస్ నాయకులు పనులు ప్రారంభిస్తున్నారు.
మంగళవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో బీఆర్ఎస్ వార్డు సభ్యుడు శివకుమార్ ఇంటి ఎదుట పబ్లిక్ రోడ్డును తొలగించి వాటర్ పైప్‌లైన్ పనులకు ఉపసర్పంచ్‌తోపాటు కాంగ్రెస్ నాయకులు ప్రారంభిస్తున్నట్టు సమాచారం అందుకొన్న సర్పంచ్ అక్కడికి వెళ్లి ప్రశ్నించారు. తనకు తెలియకుండానే పనులు ఎలా చేస్తారని ప్రశ్నించారు. అక్కడే ఉన్న కాంగ్రెస్‌కు చెందిన మాజీ వైస్ ఎంపీపీ రాముడు కుమారుడు శివుడుతోపాటు మరికొందరు సర్పంచ్‌పై దాడికి యత్నించారు. ఏ పనులు చేసినా సర్పంచ్‌కు చెప్పాల్సిన అవసరం లేదని, తమకు మంత్రి అండగా ఉన్నారని.. తమను ఎవరూ ఏమీ చేయలేరని హూంకరించారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొన్నది. తర్వాత స్థానికుల చొరవతో వివాదం సద్దుమణిగింది. కాగా ఈ ఘటనను మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి ఖండించారు. దళిత సర్పంచ్ శ్రీనివాస్‌పై కాంగ్రెస్ గూండాలు దాడికి యత్నించడం సిగ్గుమాలిన చర్యగా పేర్కొన్నారు. సర్పంచ్‌ను అవమానించిన కాంగ్రెస్ నేతలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.