హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): నాటి నుంచి నేటి వరకు బీసీలను మోసం చేయడమే కాంగ్రెస్ నైజమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు మొదలుకొని కామారెడ్డి బీసీ డిక్లరేషన్ దాకా అడుగడుగునా దగా చేస్తున్నదని దుయ్యబట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల కోసం అలవికాని హామీలిచ్చి నెరవేర్చడంలో అలసత్వం చూపుతున్నదని మండిపడ్డారు. బీసీలకు 42 శాతం కోటాపై ఓసారి చట్టం అని, మరోసారి ఆర్డినెన్స్ తీసుకొస్తామని డ్రామాలడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బోనాల పండుగ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లోని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసానికి వెళ్లారు.
ఈ సందర్భంగా అందుబాటులో ఉన్న బీఆర్ఎస్కు చెందిన బీసీ నాయకులతో సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్ల అమలులో అనుసరిస్తున్న వైఖరి, బడ్జెట్ కేటాయింపుల్లో నిర్లక్ష్యం, బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో అలసత్వం, మొత్తంగా బలహీనవర్గాలకు చేస్తున్న ద్రోహంపై విస్తృతంగా చర్చించారు. బీసీ రిజర్వేషన్లు, ఇతరత్రా హామీల అమలుకు బీఆర్ఎస్ ఏ విధంగా ఒత్తిడి తేవాలి, భవిష్యత్తులో చేపట్టబోయే కార్యాచరణపై సమాలోచనలు చేశారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశాలపై నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ స్థానిక ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపనకే కులగణన ప్రక్రియను తెరపైకి తెచ్చారని ఆరోపించారు. అసమగ్రంగా నిర్వహించడమే కాకుండా బలహీనవర్గాల జనాభాను తగ్గించి చూపించారని మండిపడ్డారు. తద్వారా పథకాలను ఎగ్గొట్టేందుకు ఎత్తుగడలు వేశారని తూర్పారబట్టారు. కామారెడ్డి డిక్లరేషన్‌లో ఏ ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చకుండా ఏమార్చుతున్నారని దుయ్యబట్టారు.
బీసీలకు 42 శాతం కోటా హామీని తప్పించుకొనేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రోజుకో రకంగా డ్రామాలు ఆడుతున్నదని కేటీఆర్ విమర్శించారు. మొదట బీసీ కమిషన్నే డెడికేటెడ్ కమిషన్‌గా పరిగణించాలని చెప్పి తన అవగాహనలేమిని చాటుకున్నదని విమర్శించారు. ఆ తర్వాత లోపభూయిష్టంగా కులగణన చేపట్టిందని చెప్పారు. పూర్తిస్థాయిలో సర్వే చేయలేదని అసెంబ్లీ సాక్షిగా చెప్పడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. బీసీల జనాభాను ఉద్దేశపూర్వకంగానే తగ్గించి చూపిందని విరుచుకుపడ్డారు. సుప్రీంకోర్టు నిర్దేశించిన మేరకు 50శాతం లోపు రిజర్వేషన్లు సాధ్యం కాదని తెలిసినా మాయమాటలు చెప్తూ వంచిస్తున్నదని నిప్పులు చెరిగారు. చిత్తశుద్ధి లేకుం డా వ్యవహరిస్తూ అడుగుడుగునా నిర్లక్ష్యాన్ని బయటపెట్టుకున్నదని చెప్పారు. ఇప్పుడు ఆర్డినెన్స్ తెస్తామని చెప్తూ మరోసారి మోసం చేసేందుకు యత్నిస్తున్నదని ఆరోపించారు.
అశాస్త్రీయంగా, లోపభూయిష్టంగా చేపట్టిన కులగణన సర్వేను సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, ఆ పార్టీ నాయకులు దేశానికి రోల్‌మోడల్‌గా చెప్పుకోవడం సిగ్గుచేటని కేటీఆర్ తీవ్రస్థాయిలో ఆరోపించారు. కేంద్రం ప్రతిపాదిస్తున్న జనగణనలో కులగణనను పకడ్బందీగా చేయాలని డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉన్నదని విమర్శించారు. పలువురు బీసీ నాయకులు మాట్లాడుతూ కేసీఆర్ బీసీల అభ్యున్నతికి అమలుచేసిన పథకాలకు నిధులివ్వకుండా దగా చేస్తున్నదని విమర్శించారు. సమావేశంలో మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, ఎంపీ వద్దిరాజు రవిచం ద్ర, మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, గంగుల కమలాకర్, జోగు రామన్న, ఎమ్మెల్యేలు పద్మారావుగౌడ్, కాలేరు వెంకటేశ్, చింతా ప్రభాకర్, ముఠాగోపాల్, వివేకాందగౌడ్, ఎమ్మెల్సీలు ఎల్ రమ ణ, శంభీర్‌పూర్ రాజు, బండ ప్రకాశ్, మాజీ ఎంపీ లింగయ్యయాదవ్, మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, మధూకర్, నోముల భగత్, భిక్షమయ్యగౌడ్, గంప గోవర్ధన్, జాజాల సురేందర్, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు రవికుమార్‌గౌడ్, శ్రీనివాస్ యాదవ్, ఆంజనేయులుగౌడ్, బాలరాజుయాదవ్, నేతలు ఉపేంద్రాచారి, కిశోర్‌గౌడ్, క్యామ మల్లేశ్ పాల్గొన్నారు.