కొల్చారం, జూలై 15: మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని పైతర గ్రామానికి చెందిన కాంగ్రెస్ దళిత నేత మారెల్లి అనిల్ కుమార్ (28)ను సోమవారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తులు తుపాకితో కాల్చి చంపారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో జిల్లాస్థాయి కాంగ్రెస్ నేతల సమావేశానికి హాజరై వస్తుండగా ఘన్పూర్ శివారులో రెండు కార్లలో వచ్చిన దుండగులు అనిల్ కారును అడ్డగించి ఒక్కసారిగా కాల్పులు జరిపారు. దీంతో ఆయన కారు రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అనిల్ బంధువులు ఆయనను మెదక్‌లోని ప్రైవేట్ దవాఖానకు తీసుకెళ్లగా, అప్పటికే మృతి చెందినట్టుగా వైద్యులు నిర్ధారించారు. అక్కడి నుంచి మృతదేహాన్ని మెదక్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఘటనాస్థలంలో ఖాళీ బుల్లెట్ షెల్స్ కనిపించినట్టుగా పోలీసులు తెలిపారు.
సమీపంలో ఉన్న రైస్‌మిల్లు సీసీ కెమెరాలను పరిశీలించగా, రెండు కార్లలో వచ్చిన దుండగులు అనిల్‌పై కాల్పులు జరిపి, పరారైనట్టుగా గుర్తించారు. దీనిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని నానక్‌రామ్ గూడలోని ఓ భూ వివాదమే అనిల్ హత్యకు కారణమని పలువురు భావిస్తున్నారు. రియల్ ఎస్టేట్ భూ వివాదంలో తనకు రావాల్సిన డబ్బుల కింద మూడు నెలల క్రితం మెర్సిడెస్ బెంజ్ కారు(టీఎస్08 ఎఫ్డీ 1122)ను అనిల్ జప్తు చేసి తెచ్చుకున్నట్టుగా తెలుస్తున్నది. ఈ కారు ఏపీలోని కడప జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే బంధువు, ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ యజమానిదిగా అనుమానిస్తున్నారు. కాగా, ఘటనకు కారణమైన దోషులను కఠినంగా శిక్షించాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఐజీ..
అనిల్ హత్య జరిగిన స్థలాన్ని మల్టీజోన్ ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి మంగళవారం పరిశీలించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై మెదక్ ఎస్పీ శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ.. సోమవారం సాయంత్రం పైతర గ్రామానికి చెందిన అనిల్ ఘనపూర్ విద్యుత్ ఉపకేంద్రం వద్ద కారు అదుపుతప్పి కల్వర్టుకు ఢీకొట్టి మరణించినట్టుగా పోలీసులకు సమాచారం అందినట్టు తెలిపారు. వెంటనే మెదక్ రూరల్ సీఐ రాజశేఖర్ రెడ్డి, కొల్చారం ఎస్సై మహమ్మద్ గౌస్ ఘటనా స్థలానికి వెళ్లి అన్ని కోణాల్లో విచారణ ప్రారంభించినట్టు తెలిపారు. మృతదేహాన్ని పరిశీలించగా ఒంటిపై 0.3 ఎంఎం సైజులో తుపాకీ గాయాలు కనిపించినట్టు చెప్పారు. అనుమానం వచ్చి ఘటనా స్థలంలో పరిశీలించగా, ఖాళీ షెల్స్ లభించినట్టు తెలిపారు. శవ పంచనామా నిర్వహించి, శరీరంలో నాలుగు బుల్లెట్లు వెలికి తీసినట్టు చెప్పారు. త్వరలోనే నేరస్తులను పట్టుకుంటామని ఎస్పీ తెలిపారు. ఏఎస్పీ మహేందర్, మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్, మెదక్ రూరల్ సీఐ రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.