School Fees | హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): స్కూల్ ఫీజులు కట్టడి చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఆ దిశగా నిర్దిష్టమైన చర్యలు చేపట్టడం లేదని విమర్శలు ఎదుర్కొంటున్నది. విద్యాకమిషన్, విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నదని తల్లిదండ్రులు, నిపుణులు మండిపడుతున్నారు. విద్యాసంవత్సరం సగానికి పైగా పూర్తయినా స్కూళ్ల ఫీజుల దోపిడీని ప్రభుత్వం అరికట్టలేకపోతున్నదని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ప్రభుత్వం జాప్యం తీరు చూస్తుంటే మరో విద్యాసంవత్సరం వచ్చినా చట్టం కార్యరూపం దాల్చేలా కనిపించడం లేదని, మళ్లీ ఫీజుల గండం తప్పేలా లేదని విద్యారంగ నిపుణులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
కమిషన్ కసరత్తు ఏమైంది?
రాష్ట్రంలో ప్రైవేట్ స్కూళ్లల్లో ఫీజుల నియంత్రణపై విద్యాకమిషన్ అన్ని వర్గాలతో సంప్రదింపులు జరుపుతున్నదని, కమిషన్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఫీజుల నియంత్రణ చేపడుతుందని అధికారులు చెప్తున్నారు. ఫీజుల కట్టడి కోసం జీవో జారీ చేసేందుకు కూడా సర్కారు సన్నాహాలు చేస్తున్నదని మరికొందరు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. కానీ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే చట్టం తీసుకురావాలని, జోవో వల్ల ఉపయోగం ఉండదని, అది కోర్టులో నిలబడదని నిపుణులు స్పష్టంచేస్తున్నారు. చట్టం రూపొందించాలంటే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది. బడ్జెట్ సమావేశాలను ఫిబ్రవరిలో నిర్వహించే అవకాశముంది. అప్పుడు చట్టంపై దృష్టి పెట్టినా వచ్చే విద్యాసంవత్సరం నాటికి కూడా అమలు జరుగుతుందా లేదా అని సందేహాలు వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికే సీబీఎస్ఈ స్కూళ్లు వచ్చే విద్యాసంవత్సరానికి కూడా ప్రవేశాలు ప్రారంభించి, లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నాయి.
విద్యాకమిషన్ పరిశీలనలు
రాష్ట్రంలో స్కూల్ ఫీజుల నియంత్రణ కోసం విద్యాకమిషన్ పలు ప్రతిపాదనలు పరిశీలిస్తున్నదని అధికారులు చెప్తున్నారు. స్కూళ్లలో ఫీజుల నియంత్రణ కోసం జిల్లా, రాష్ట్ర స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయడం, విస్తీర్ణం, వసతుల ఆధారంగా స్కూళ్లను 4 కేటగిరీలుగా విభజించడం వంటి పలు అంశాలపై దృష్టి పెట్టినట్టు తెలిపారు. స్కూళ్లు ఫీజును 6.5 శాతం కంటే ఎక్కువ పెంచకుండా కట్టడి చేసేందుకు వీలుగా కూడా కమిషన్ నివేదికలో సిఫారసు పొందుపర్చనున్నట్టు చెప్తున్నారు.
తల్లిదండ్రుల విజ్ఞాపనలు
ఫీజుల పెంపు మూడేండ్లకోసారి మాత్రమే ఉండాలని, ఫీజుల నియంత్రణ కోసం రాష్ట్రస్థాయిలో చట్టబద్ధ కమిషన్, ఫిర్యాదుల పరిష్కార విభాగం ఏర్పాటు చేయాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. పుస్తకాలు, యూనిఫామ్, స్టేషనరీని ఎక్కడైనా కొనుగోలు చేసే వెసులుబాటును కల్పించాలని కోరుతున్నారు.
పాఠశాలల యాజమాన్యాల వినతులు
రూ.50వేల లోపు ఫీజులున్న పాఠశాలలను ఫీజుల నియంత్రణ కమిటీల పరిధిలోకి తీసుకురావొద్దని, ఏటా 15శాతం ఫీజు పెంచుకునే వీలు కల్పించాలని పాఠశాలల యాజమాన్యాల ప్రతినిధులు విద్యాకమిషన్ను కోరుతున్నారు. ఒక సొసైటీ ఒక పాఠశాలను మాత్రమే నడిపేలా చూడాలని, ఎక్కువ నడిపే సొసైటీలపై చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు.