హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ) : ‘కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది.. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీంను (సీపీఎస్) రద్దుచేస్తుంది. పాత పెన్షన్ (ఓల్డ్ పెన్షన్) విధానాన్ని తెస్తుంది’ ఇది ఆ పార్టీ మ్యానిఫెస్టో హామీ. కానీ అధికారంలోకి వచ్చాక ఈ హామీని ఆ పార్టీ విస్మరించింది. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్లలో ఇదే కాంగ్రెస్ పార్టీ సీపీఎస్‌ను రద్దు చేసింది. ఝార్ఖండ్‌లో జేఎంఎం, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కూడా సీపీఎస్ రద్దు చేసింది. పంజాబ్‌లో కూడా రద్దుకు నోటిఫికేషన్ ఇచ్చింది. తెలంగాణలో మాత్రం ఆ ఊసే ఎత్తడం లేదు. దీంతో ఉద్యోగులంతా నిరసన కార్యక్రమాలకు సిద్ధమవుతున్నారు.
సీపీఎస్ విధానంతో ఉద్యోగి రిటైర్డ్ అయిన తర్వాత వచ్చే 50శాతం పెన్షన్ (మూల వేతనంలో) దూరమయ్యింది. ఇది వరకు 50శాతం పెన్షన్‌తో ఉద్యోగికి భరోసా దొరికేది. కానిప్పుడు పెట్టుబడుల పెన్షన్ వచ్చింది.. ప్రాన్ అకౌంట్లో జమ అయిన మొత్తంలో 40శాతం ఇన్సూరెన్స్ కంపెనీ వద్ద పెన్షన్ ప్లాన్‌ను కొనుక్కోవాలి. అలా కొన్న పాలసీని బట్టి ఏడాదికి 6శాతం మించకుండా పెన్షన్ రూపంలో ఇస్తారు. మిగిలిన 60శాతం మాత్రమే ఉద్యోగి వినియోగించుకోవచ్చు. విత్‌డ్రా చేసుకునే 60శాతం మొత్తానికి ఆదాయపు పన్ను పరిధిలోకి వస్తుంది. జీఎస్టీ వర్తిస్తుంది. జీపీఎఫ్ ఉండదు. గ్రాట్యుటీ అందదు. డెత్ రిలీఫ్ కూడా రాదు.
రాష్ట్రంలో ఉద్యోగులకున్న పింఛన్ హక్కు ను హరించింది కాంగ్రెస్ పార్టీయే. 2004లో అప్పటి రాజశేఖర్‌రెడ్డి సర్కారు సెప్టెంబర్ 1న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ సీపీఎస్‌ను వర్తింపజేస్తూ జీవో -653ని జారీచేసింది. ఏపీ పెన్షన్ రూల్స్ 1980ని సవరించింది. ఈ నిర్ణయంతో రెండు దశాబ్దాలుగా లక్షలాది మంది ఉద్యోగులు పెన్షన్‌కు దూరమయ్యారు. ఈ కారణంగానే సెప్టెంబర్ 1న ఉద్యోగులు, ఉపాధ్యాయులు ‘పెన్షన్ విద్రోహ దినం’ గా నిర్వహిస్తున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ ఒకటిన ఉద్యోగుల జేఏసీ ఆర్టీసీ కల్యాణమండపంలో భారీ సభను నిర్వహించనుంది. పీఆర్టీయూ టీఎస్ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్‌లో నిర్వహించే మహాధర్నాకు నల్ల దుస్తులు ధరించి ఉద్యోగులంతా తరలిరావాలని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి పిలుపునిచ్చారు.
గత 20 నెలలుగా ప్రభుత్వం ప్రాన్ ఖాతాకు జమచేయాల్సిన వాటాను జమ చేయడంలేదు. నెలనెలా 200 కోట్లను సర్కారే వాడుకుంటున్నది. ఇదిలా ఉండగా, సీపీఎస్ ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపకపోవడం, సీపీఎస్‌ను రద్దుచేయకపోవడంతో ఉద్యోగుల్లో ఆగ్రహ జ్వాలలు మిన్నంటుతున్నాయి. ఉద్యోగ సంఘాల జేఏసీ కూడా పలుమార్లు సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేసింది. అయినా ఉలుకు, పలుకు లేదు. డీఎస్సీ నోటిఫికేషన్ 2003లో ఇచ్చినా, ఉద్యోగాలను 2004లో భర్తీచేశారు. నోటిఫికేషన్ ప్రామాణికంగా కాకుండా పోస్టింగ్ తేదీ ఆధారంగా సీపీఎస్‌ను అమలుచేయడంతో ఆయా టీచర్ల పాలిట శాపంగా మారింది. దీనికీ కాంగ్రెస్‌పార్టీయే కారణం. ఇటీవలే హైకోర్టు కూడా 2003 డీఎస్సీ టీచర్లకు పాత పింఛన్‌కు అర్హులేనని తీర్పునిచ్చింది. ఆఖరుకు ఈ తీర్పును కూడా ప్రభుత్వం అమలు చేయడం లేదు. దీంతో ఉద్యోగులు, సంఘాల నేతలు పోరుకు రెడీ అవుతున్నారు.