Congress | హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సీపీఐకి రెండు ఎమ్మెల్సీ సీట్లు ఇస్తామన్న కాంగ్రెస్ ఇప్పుడు మాట తప్పుతున్నట్టు తెలిసింది. ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అవుతున్న ఐదు సీట్లలో తమకు రెండు కేటాయించాలని సీపీఐ పట్టుబడుతుండగా, ఒకటి మాత్రమే ఇవ్వగలమని కాంగ్రెస్ కరాఖండిగా చెప్పినట్టు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సీపీఐతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ రెండు ఎమ్మెల్యే (కొత్తగూడెం, మునుగోడు సెగ్మెంట్లు), ఒక ఎమ్మెల్సీ స్థానం కేటాయిస్తామని ఒప్పందం చేసుకుంది. అయితే అప్పటివరకూ బీజేపీలో ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తిరిగి కాంగ్రెస్‌లోకి రావడంతో సీపీఐ మునుగోడు స్థానాన్ని త్యాగం చేయాల్సి వచ్చింది.
ఇందుకుగాను అదనంగా మరో ఎమ్మెల్సీ సీటు ఇస్తామని కాంగ్రెస్ పెద్దలు హామీ ఇచ్చారు. గత 14 నెలల నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన ప్రతిసారి సీపీఐ నేతలు వెళ్లి సీఎం రేవంత్‌రెడ్డితో సీటు కోసం చర్చలు జరుపుతున్నారు. ఎమ్మెల్యే కోటాలో భర్తీ చేద్దామని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చినట్టు తెలిసింది. ఇటీవల ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో సీపీఐ నేతలు మరోసారి తమ సీట్ల విషయమై చర్చలు జరిపారు. అయితే గతంలో హామీ ఇచ్చినట్టు రెండు స్థానాలు ఇవ్వలేమని ఒక్కటైతే ఇవ్వగలమని కాంగ్రెస్ పెద్దలు స్పష్టం చేసినట్టు తెలిసింది. సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయంతో కంగుతిన్న సీపీఐ నేతలు ఢిల్లీ వెళ్లి ఏఐసీసీ పెద్దలతో తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించినట్టు సమాచారం.
సీపీఐలో బీసీ వాదం తెరపైకి..
కాంగ్రెస్ పార్టీ రెండు ఎమ్మెల్సీ స్థానాలు కేటాయిస్తే తమ పార్టీ నుంచి సలికంటి సత్యం, చాడ వెంకటరెడ్డిని బరిలోకి దించాలని సీపీఐ యోచిస్తున్నది. మునుగోడు నుంచి రెండుసార్లు పోటీ చేసే అవకాశం కోల్పోయిన సత్యంకు ఎమ్మెల్సీ అ భ్యర్థిగా అవకాశం ఇవ్వాలని ఖమ్మ ం, హన్మకొండలో జరిగిన సీపీ ఐ జాతీయ కౌన్సిల్ సమావేశా ల్లో నిర్ణయించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో హుస్నాబాద్ నుంచి పోటీ చేయాలని సీపీఐ సీనియర్ నేత చాడవెంకటరెడ్డి భావించారు. కానీ పొత్తులో భాగంగా ఆ సీటును కాంగ్రెస్‌కు వదులుకోవాల్సి వచ్చింది. ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని సీపీఐతోపాటు కాంగ్రెస్ కూడా హామీ ఇచ్చింది. కాంగ్రెస్ రెండు సీట్లు ఇస్తే చాడ, సత్యం ఇద్దరికీ అవకాశం లభిస్తుంది. అలాకాకుండా ఒకే స్థానం కేటాయిస్తే సీపీఐలో బీసీవాదం తెరపైకి వచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఆ ఒక్క స్థానంలో చాడ వెంకటరెడ్డికి అవకాశం ఇవ్వాలని సీపీఐ జాతీయ నాయకత్వం భావిస్తున్నట్టు సమాచారం.