హైదరాబాద్: ఇది ప్రజాపాలన కాదని ప్రజలను వేధించే పాలన అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. కాంగ్రెస్ పాలన దేశ రాజకీయ చరిత్రలోనే మాయని మచ్చ అంటూ దుయ్యబట్టారు. ఆర్థిక పరిస్థితి మాకెందుకు తెలియదు, హామీలన్నీ అమలు చేస్తామని చెప్పారు.. సంపద సృష్టిస్తాం, ప్రజలకు పంచుతాం అని ప్రగల్భాలు పలికారు. కానీ 15 నెలల పాలనలో ఊదు గాలింది లేదు.. పీరు లేసింది లేదని ధ్వజమెత్తారు. సమాజంలోని అన్ని వర్గాలు కాంగ్రెస్ 420 హామీలను చూసి మోసపోయాయని ఎక్స్ వేదికగా విమర్శించారు.
‘‘ఆర్థిక పరిస్థితి మాకెందుకు తెలియదు .. హామీలన్నీ అమలు చేస్తాం అన్నారు. సంపద సృష్టిస్తాం, ప్రజలకు పంచుతాం అని ప్రగల్భాలు పలికారు. 15 నెలల పాలనలో ఊదు గాలింది లేదు.. పీరు లేసింది లేదు. సగటున నెలకు రూ.10 వేల కోట్ల చొప్పున రూ.లక్ష 50 వేల కోట్లు అప్పు తెచ్చినట్లు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారికంగా ఒప్పుకుంది.
రుణమాఫీ కాలేదు, రైతుభరోసా రాలేదు, రైతుబీమా ప్రీమియం కట్టలేదు, సాగునీళ్లు రాలేదు, పంటల కొనుగోళ్లు జరగడం లేదు, రూ.500 క్వింటాలు ధాన్యానికి బోనస్ ఇవ్వడం లేదు. కేసీఆర్ కిట్ ఆగింది, న్యూట్రిషన్ కిట్ మాయమైంది, దవాఖానాల్లో మందులు లేవు, వరంగల్ దవాఖాన నిర్మాణం నిలిపేశారు, TIMS దవాఖానల నిర్మాణం ఆపేశారు.
కాళేశ్వరం మరమ్మతులు చేయకుండా.. రైతులకు సాగునీళ్లు ఇవ్వకుండా కన్నీరు పెట్టిస్తున్నారు. పాలమూరు రంగారెడ్డి పనులు పడావు పెట్టారు. గురుకులాల్లో నాణ్యమైన ఆహారం అందక విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు.. విషాహారం తిని ప్రాణాలు తీసుకుంటున్నారు. దొంగలు, దొంగలు కలిసి ఊళ్లు పంచుకున్నట్లు.. తెచ్చిన అప్పులను 20 శాతం కమీషన్లు దండుకుని బిల్లులు చెల్లిస్తున్నారు. కాంగ్రెస్ పాలన దేశ రాజకీయ చరిత్రలోనే మాయని మచ్చ. రైతులు, రైతుకూలీలు, విద్యార్థులు, ఉద్యోగులు, యువత, ప్రజలు, సమాజంలోని అన్ని వర్గాలు కాంగ్రెస్ 420 హామీలను చూసి మోసపోయాయి. ఇది ప్రజాపాలన కాదు. ప్రజలను వేధించే పాలన’’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.