హైదరాబాద్, ఏప్రిల్ 2(నమస్తే తెలంగాణ): తెలంగాణలో అధికారం కోసం ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేసినట్టే.. కేరళ ప్రజలను కూడా వంచించేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేరళలో ‘ఐదు గ్యారెంటీల’ను ప్రకటించింది. మన దగ్గర మాదిరిగానే ‘ఇందిరమ్మ’ పేరు పెట్టింది. గ్యారెంటీల పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేసిన రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డే కేరళలోనూ 5 గ్యారెంటీలు, 420 హామీలను ప్రకటించడం గమనార్హం.
నమ్మించి, వంచించి అయినా అధికారం కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ‘గ్యారెంటీల గారడీ’ ప్రక్రియను గతంలోనే తిరువనంతపురంలో ప్రారంభించారు. దానికి కొనసాగింపుగా తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి మలయాళీలను మాయ చేసేందుకు గురువారం కొజికోడ్‌లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేశారు.
కాంగ్రెస్ నాయకత్వంలోని యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్(యూడీఎఫ్) అధికారంలోకి వస్తే ఐదు మౌలిక సంక్షేమ గ్యారెంటీలను అమలు చేస్తామని ప్రకటించారు. పేదల పెన్షన్‌ను నెలకు రూ.3వేలకు పెంచుతామని, ఒకో కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా అమలు చేస్తామని, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని, కాలేజీకి వెళ్లే ఆడపిల్లలకు నెలకు రూ.వెయ్యి సాయం అందిస్తామని, యువతకు రూ.5లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని, ఉద్యోగాలు కల్పించేందుకు జాబ్ వాచ్ టవర్లను ఏర్పాటు చేస్తామంటూ పలు హామీలను గుప్పించారు.
కేరళ యువతకు చిన్న వ్యాపారాల కోసం రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు జాబ్ వాచ్ టవర్లను ఏర్పాటు చేస్తామని చెప్పింది. తెలంగాణలో రాహుల్‌గాంధీ స్వయంగా వచ్చి జాబ్ క్యాలెండర్ అమలు చేస్తామని ప్రకటించారు. ఏడాదిన్నర కిందట రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా జాబ్ క్యాలెండర్ ప్రకటించింది. ఆ తర్వాత అమలు మరచిపోయింది.
నిరుద్యోగులు నిరసనలు చేస్తున్నా, రోడ్లెక్కి ధర్నాలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల కేరళ మీడియాలో ‘తెలంగాణ ప్రగతిపథంలో పయనిస్తున్నది’ అనే శీర్షికతో ప్రకటనలు ఇచ్చారు. ఇందులో కాంగ్రెస్ పాలనలో 20లక్షల కొత్త ఉద్యోగాలు ఇచ్చామంటూ అసత్యాలు ప్రచా రం చేశారు. దీంతో తెలంగాణ తరహాలో కేరళ యువతకు కూడా కుచ్చుటోపీ పెట్టేందుకు కాంగ్రెస్ సిద్ధమైందని నిరుద్యోగులు మండిపడుతున్నారు.
కేరళలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ సైతం అమలు సాధ్యం కాదని విశ్లేషకులు చెప్తున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటక, తెలంగాణలో ఉచిత ప్రయాణం పథకం అమలు అవుతున్నది. కర్ణాటకలో ఈ పథకం ప్రభుత్వానికి భారంగా మారింది. దీనిని కొనసాగించడం సాధ్యం కాదని ఆ రాష్ట్ర మంత్రులే ప్రకటిస్తున్నారు. పైగా కర్ణాటక జీఎస్డీపీతో(రూ.29 లక్షల కోట్లు) పోలిస్తే కేరళ జీఎస్డీపీ(రూ.10.22 లక్షల కోట్లు) 40శాతానికి మించదు.
కాబట్టి కేరళలో ఉచిత ప్రయాణ పథకం సాధ్యమవుతుందో లేదో కూడా ఆలోచించకుండా హామీ ఇచ్చారని రాజకీయ విశ్లేషకులు మండిపడుతున్నారు. తెలంగాణలో ‘ఇందిరమ్మ ఇండ్లు’ కింద పేదలందరికీ గృహాలు నిర్మించి ఇస్తామన్న హామీని అమలు చేయాల్సిందిపోయి పేదల ఇండ్లపైకి బుల్డోజర్లను పంపిన సంగతి తెలిసిందే. ఇలా తెలంగాణలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అరాచక పాలనను కేరళ ప్రజలు గమనిస్తున్నారని, అయినా ‘నవ్విపోదురుగాక నాకేంటి?..’ అన్నట్టుగా కాంగ్రెస్ వ్యవహరిస్తూ ఐదు గ్యారెంటీల గారడీ చేస్తున్నదని విశ్లేషకులు మండిపడుతున్నారు.
తెలంగాణలో అధికారంలోకి వస్తే చేయూత గ్యారెంటీని అమలు చేస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అవ్వాతాతలకు కేసీఆర్ 2వేలు మాత్రమే ఇస్తున్నారని, తమను గెలిపిస్తే పెన్షన్‌ను రూ.4వేలకు పెంచుతామని ప్రకటించింది. ఇప్పటివరకు పింఛన్ల పెంపు ఊసే లేదు. కానీ అదే రేవంత్‌రెడ్డి కేరళకు వెళ్లి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పెన్షన్లను రూ.3వేలకు పెంచుతామని ప్రకటించడం విశేషం.
తెలంగాణలో మహాలక్ష్మీ పథకం కింద 18 ఏండ్లు పైబడిన మహిళలకు నెల కు రూ.2,500 చొప్పున ‘గ్యారెంటీ’గా ఆర్థిక సాయం అందిస్తామని కాంగ్రెస్ చెప్పింది. రాష్ట్రంలోని సుమారు 60లక్షల మంది మహిళలు రెండున్నరేండ్లుగా ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తూనే ఉన్నా రు. కాలేజీలకు వెళ్లే యువతులకు స్కూటీ లు ఇస్తామన్న హామీని భవిష్యత్తులో అమలు చేస్తారనే గ్యారెంటీ కూడా లేదు. అయినా కేరళలో కాలేజీలకు వెళ్లే యువతులకు నెలకు రూ.వెయ్యి ఆర్థిక సాయం అందిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది.