Sarpanch Elections | యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో ఎన్నికల అధికారుల తీరుతో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ఓడిపోయారు. వాసాలమర్రిలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ఓటు మిస్ అయ్యింది. దీంతో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థికి, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థికి సమాన ఓట్లు పోలయ్యాయి. దీంతో ఎన్నికల అధికారులు టాస్ వేసి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిని విజేతగా ప్రకటించారు. అయితే మరుసటి రోజు కౌంటింగ్ రూమ్ కిటికీ వద్ద మిస్సయిన ఓటు లభించింది. అందులో బీఆర్ఎస్ అభ్యర్థికి ఓటు పడటం గమనార్హం.
వాసాలమర్రి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 1236 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 14 చెల్లనివి పోగా 3 నోటాకు పడ్డాయి. దీంతో పోటీలో నిలిచిన ఇద్దరు అభ్యర్థులకు చెరో 609 ఓట్లు పోలయ్యాయి. ఇందులో రెండో వార్డులో 119 ఓట్లు పోలయ్యాయి. కానీ కౌంటింగ్ సమయంలో 118 బ్యాలెట్ పేపర్లను మాత్రమే ఎన్నికల అధికారులు చూపించారు. దీంతో ఆ ఓటు గురించి అడగ్గా ఎన్నికల అధికారులు పట్టించుకోలేదు. ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఓట్లు వచ్చాయని చెబుతూ.. టాస్ వేసి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిని విజేతగా నిర్ణయించారు. అయితే మరుసటి రోజు కౌంటింగ్ జరిగిన రూమ్ దగ్గరకు వెళ్లి చూడగా.. గది కిటికీ బయట మిస్సైన ఓటు లభించింది. అందులో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థికి ఓటు నమోదు కావడం గమనార్హం. దీంతో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఉషారాణి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎన్నికల అధికారులపై చర్యలు తీసుకోవాలని.. లభించిన ఓటు, అన్ని ఆధారాలతో జిల్లా కలెక్టర్, రాష్ట్ర ఎన్నికల అధికారిని కలిసి ఫిర్యాదుచేశారు.