ములుగు, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): ములుగు జిల్లాలో (Mulugu) రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో (Election Results) దుమారం రేగింది. మండల పరిధిలోని ఇంచర్ల గ్రామంలో మొదట స్వతంత్ర అభ్యర్థి గెలుపొందగా, అధికార పార్టీకి చెందిన సర్పంచ్ అభ్యర్థి మూడు సార్లు రీ కౌంటింగ్ పెట్టించి విజయం సాధించినట్టు సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతున్నది. స్వతంత్ర అభ్యర్థి(కాంగ్రెస్ రెబల్) 9ఓట్ల తేడాతో విజయం సాధించినట్టు ఎన్నికల అధికారులు మొదట ప్రకటించగా, అధికార పార్టీకి చెందిన అభ్యర్థి అభ్యర్థన మేరకు ఎన్నికల అధికారులు మూడు సార్లు రీ కౌంటింగ్ చేసినట్టు జోరుగా ప్రచారం జరుగుతున్నది.
9ఓట్ల తేడాతో వెనుకబడిన అధికార పార్టీకి చెందిన అభ్యర్థి 104ఓట్ల తేడాతో విజయం సాధించినట్టు అధికారులు ప్రకటించడంపై ఓటర్లలో అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఎన్నికల అధికారులు కౌంటింగ్ కేంద్రాల్లోని సీసీ పుటేజీలను పరిశీలించి ఫలితంపై అనుమానాలు నివృత్తి చేయాల్సి ఉంది.