‘రౌడీలు.. రౌడీలు.. అంటున్నరు! రౌడీలంటే మంచోళ్లు. ఎవరూ పరిష్కరించలేని పంచాయితీలను వారు తీర్మానిస్తరు. నా మీద కూడా 35 కేసులున్నయి. అయితే ఏమైతది?! ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు కూడా సెటిల్మెంట్ల కోసం రౌడీల దగ్గరికే వస్తరు’
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే ఎన్నికల్లో పోటీచేస్తున్న ఒక కుటుంబం.. రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన అధికారిక వ్యవస్థల కంటే రౌడీషీటర్లే మిన్న అన్నట్టు మాట్లాడటం దేనికి సంకేతం? వీరు అధికారంలోకి వస్తే ఏం చేస్తారు? ప్రజలకు సేవ చేస్తరా? లేక సెటిల్మెంట్లు చేస్తరా? ఎవరూ పరిష్కరించలేని సమస్యలను రౌడీలే పరిష్కరించగలరని ప్రకటిస్తున్న వీరికి ఓటేసిన తరువాత.. సామాన్యుడికి అన్యాయం జరిగితే పోలీసులను ఆశ్రయించాలా? లేక రౌడీషీటర్లను ఆశ్రయించాల్నా? జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలను వేధిస్తున్న ప్రశ్నలివి. కార్పొరేటర్లకు ధమ్కీలివ్వడంతోపాటు భూకబ్జాలపై ఆరోపణలు ఎదుర్కొంటున్న నవీన్ యాదవ్‌కు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. ఒకవైపు చిన్న శ్రీశైలంయాదవ్, ఆయన తమ్ముడు రమేశ్‌యాదవ్‌ను రౌడీషీటర్లు అంటూ ప్రభుత్వం బైండోవర్ చేస్తుండగా.. మరోవైపు సీఎం రేవంత్ వారిని రౌడీలు కాదు… బస్తీల్లో సేవ చేసేవాళ్లు అంటూ కితాబులివ్వడంపై ఓటర్లు సందేహం వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఆడబిడ్డ కావాలో.. రౌడీబిడ్డ కావాలో తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని అంటున్నారు.
పెరిగిన నేరాలు
సురక్షిత నగరాల జాబితాలో హైదరాబాద్ ముందువరుసలో ఉన్నట్టు అనేక సర్వేల్లో వెల్లడైంది. మినీ భారతంలాంటి ఈ చారిత్రక నగరంలో పదేండ్లుగా శాంతిభద్రతలు సైతం మె రుగ్గా ఉన్నట్టు పలు నివేదికలు వెల్లడించాయి. కానీ రెండేండ్లుగా హైదరాబాద్‌లోనే కాదు& శివారుల్లోనూ శాంతిభద్రతల పరిస్థితి ఆందోళనకరంగా తయారైంది. కేసీఆర్ పాలనతో పోలిస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలో హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో 40 శాతానికి పైగా నేరాలు పెరుగగా.. రెండో సంవత్సరం హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 22%, సైబరాబాద్ పరిధిలో 44% నేరాలు పెరిగాయి. బర్ నేరాలు మునుపటికంటే 60 శాతానికి పైగా పెరిగాయని పోలీసు రికార్డులే చెబుతున్నాయి.
ఉప ఎన్నిక ద్వారా కొత్త ఒరవడి
ముంబై వంటి నగరాల మాదిరిగా హైదరాబాద్‌లో సంఘటిత నేరాలు అంతగా కనిపించవని ఇటీవల కొందరు రిటైర్డ్ పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ద్వారా తొలిసారిగా ఆ ముప్పు నగరవాసులకు ముంచుకొచ్చే అవకాశమున్నదని విశ్లేషించారు. ఈ ఉప ఎన్నికలో రౌడీషీటర్‌గా ఉన్న శ్రీశైలంయాదవ్ కుమారుడు నవీన్‌యాదవ్‌కు కాంగ్రెస్ టికెట్ ఇవ్వడం అధికార యంత్రాంగంలోనూ ఆందోళన కలిగించిందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.
ప్రశాంత వాతావరణం చిన్నాభిన్నం
ఉప ఎన్నికను పురస్కరించుకొని పోలీసులు చిన్నశ్రీశైలం యాదవ్, రమేశ్ యాదవ్ సహా 141 మంది రౌడీషీటర్లను బైండోవర్ చే శారు. జూబ్లీహిల్స్ పరిధిలో ఇంతమంది రౌడీషీటర్లు ఉన్నా గతంలో మాగంటి గోపీనాధ్ ఎమ్మెల్యేగా.. కేసీఆర్ సీఎంగా ఉన్నపుడు ఏ ఒక్కరూ బయటికొచ్చి ప్రజల్ని ఇబ్బంది పెట్టే సాహసం చేయలేకపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఏకంగా వారిని ప్రధాన రాజకీయ స్రవంతిలోకి తీసుకురావడం అందరినీ ఆందోళనకు గురిచేస్తున్నది. ప్రశాంత వాతావరణానికి భగ్నం కలుగుతుందనే సూచనలు కనిపిస్తున్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ఓవైపు హైడ్రా.. మరోవైపు సెటిల్మెంట్లు
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని బస్తీల్లో అనేకమంది నిరుపేదలు 20-30 గజాల్లో ఇండ్లు నిర్మించుకొని జీవిస్తున్నారు. ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం వాటిని కూల్చివేస్తుండటం తో ఇక్కడి బస్తీవాసుల్లో కంటిమీద కునుకు కరువైందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రౌడీలు మంచోళ్లు… సెటిల్మెంట్లు చేస్తారంటున్న వారి చేతికి అధికారమిస్తే భూ సెటిల్మెంట్లు పెరిగిపోతాయని పలువురు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.