బంజారాహిల్స్, అక్టోబర్ 9: జీవితాంతం పేదలు, కార్మికుల పక్షాన పోరాడిన నాయకుడు, గరీబోళ్ల దేవుడిగా మన్ననలు అందుకున్న ప్రజాసేవకుడు పీ జనార్దన్‌రెడ్డి. పీజేఆర్‌గా (PJR) సుపరిచితమైన ఆ యన సమైక్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్రవేశారు. సీఎల్పీ నేతగా పనిచేశారు. తెలంగాణ హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపైనా గళం వినిపించిన ముక్కుసూటితనం పీజేఆర్ సొంతం. అంతటి మహోన్నతమైన నాయకుడిపై జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా టికెట్ దక్కించుకున్న నవీన్‌యాదవ్ (Naveen Yadav) అనుచిత వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థిత్వం ఖరారు చేసిన తర్వాత యూసుఫ్‌గూడలో మీడియాతో మాట్లాడిన నవీన్‌యాదవ్.. జూబ్లీహిల్స్‌లో 47 ఏండ్లలో ఎవరూ స్థానికుడికి టికెట్ ఇవ్వలేదని, ఇప్పటివరకు ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా గెలిచిన వారంతా నాన్‌లోకల్ అని తెలిపారు. మొదటిసారి లోకల్ నాయకుడికి కాంగ్రెస్ టికెట్ ఇచ్చిందని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా పీజేఆర్ కూడా నాన్‌లోకల్ నాయకుడేనని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పీజేఆర్ గురించి మాట్లాడే స్థాయి, అర్హత నవీన్‌యాదవ్‌కు లేవని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతున్నది.
గతంలో 2009లో నియోజకవర్గాల పునర్విభజన జరగే వరకు దేశంలోనే అతిపెద్ద అసెంబ్లీ నియోజకవర్గం ఖైరతాబాద్. అటువంటి నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ప్రాతినిధ్యం వహించిన ఘనత పీజేఆర్ సొంతమని, అప్పుడు జూబ్లీహిల్స్ కూడా ఖైరతాబాద్‌లో భాగమేనని గుర్తుచేస్తున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి కేవలం 16 ఏండ్ల చరిత్ర మాత్రమే ఉందని, అక్కడ 47 ఏండ్లుగా లోకల్ వాళ్లు గెలవలేదని అనడం అవగాహనరాహిత్యమని చెప్తున్నారు. గతంలో నవీన్యాదవ్తోపాటు ఆయన కుటుంబసభ్యులు పలుసార్లు ఎన్నికల్లో పోటీచేసినా ఏనాడూ గెలిచిన చరిత్ర లేదని విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్‌రెడ్డి బీఆర్ఎస్ గెలుపు కోసం విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేస్తున్నారు. మరోవైపు పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి కాంగ్రెస్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో నవీన్‌యాదవ్ వ్యాఖ్యలపై సొంతపార్టీ కాంగ్రెస్ నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.