రవీంద్రభారతి, నవంబర్ 9: వనపర్తి అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి మేఘారెడ్డి తనకు ఇవ్వాల్సిన రూ.3.55 కోట్ల కాంట్రాక్ట్ డబ్బు ఇవ్వకుండా మోసం చేశాడని నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరుకు చెందిన సివిల్ కాంట్రాక్టర్ ఒగ్గు పర్వతాలు ఆరోపించారు. డబ్బులు ఇ వ్వకుంటే మేఘారెడ్డి ఇంటి ఎదుట ఆత్మహత్య చేసుకుంటానని ఆవేదన వ్యక్తంచేశారు. గురువారం హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఒగ్గు పర్వతాలు దంపతులు, బీసీ సంక్షేమ సంఘం నేత నీలా వెంకటేశ్, రాజ్‌కుమార్ మాట్లాడారు. ఈ సందర్భంగా బాధితుడు మాట్లాడుతూ.. మేఘారెడ్డి తనకు ఛత్తీస్‌గఢ్‌లో రైల్వే కాంట్రాక్టు వచ్చిందని, అక్కడ సబ్ కాంట్రాక్ట్ ఇప్పిస్తానని నమ్మించాడని తెలిపారు.
హైదరాబాద్ కొత్తపేటలోని గ్రీన్‌హిల్స్ కాలనీలోని ఇంటికి పిలుపించుకొని తనకు సహకరిస్తే భవిష్యత్తులో మంచి కాంట్రాక్ట్‌లు ఇప్పిస్తానని, అవసరమైతే ఎస్క్రో అకౌంట్ ఇప్పిస్తానని నమ్మించాడని చెప్పారు. 2017 జనవరిలో ఛత్తీస్‌గఢ్‌లో పనులు ప్రారంభించానని, ఫిబ్రవరి 6న వనపర్తి గ్రీన్‌పార్కు హోటల్లో వర్క్ ఆర్డర్ కాపీ ఇవ్వడంతో 20 రోజు లు అక్కడే ఉండి పనిచేయించానని చెప్పారు. తీరా బిల్లులు అడిగితే సదరన్ కం పెనీ వాళ్లు డబ్బు ఇవ్వలేదన్నాడని, కంపెనీలో ఆరా తీయగా ఆ డబ్బులు ఇచ్చినట్టు తెలిసిందని, దీంతో మేఘారెడ్డి డబ్బులు అడిగితే బెదిరింపులకు పాల్పడ్డారని బాధితుడు కన్నీటిపర్యంతమయ్యారు. మేఘారెడ్డి కుటుంబంతో తనకు ప్రాణహాని ఉన్నదని వనపర్తి స్టేషన్లో కేసు పెట్టినట్టు తెలిపారు. డబ్బు ఇవ్వకపోతే తన కుటుంబానికి ఆత్మహత్యే శరణ్యమని వాపోయాడు. సీఎం కేసీఆర్ జోక్యం చేసుకొని డబ్బు ఇప్పించాలని కోరారు.
ఒగ్గు పర్వతాలుకు చెల్లించాల్సిన 3.55 కోట్లు వెంటనే చెల్లించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నేత నీలా వెంకటేశ్ కోరారు. పర్వతాలు కుటుంబం ఏదైనా అఘాత్యానికి పాల్పడితే పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, మేఘారెడ్డిలే బాధ్యత వహించాలని అన్నారు. మెఘారెడ్డి తక్షణమే పర్వతాలుకు డబ్బులు ఇవ్వాలని, లేకుంటే రాష్ట్ర ఎలక్షన్ కమిషన్, డీజీపీకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. కాంట్రాక్ట్ డబ్బు ఇవ్వకుండా వేధిస్తున్న మెఘారెడ్డికి వెంటనే కాంగ్రెస్ టికెట్ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.