హైదరాబాద్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ) : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి దాదాపు ఖరారైనట్టు తెలిసింది. మొదటి నుంచీ ఊహించినట్టుగా ఎంఐఎం ఆశీస్సులు పుష్కలంగా ఉన్న చిన్న శ్రీశైలం యాదవ్ కుమారుడు నవీన్ కుమార్ యాదవ్ వైపే సీఎం రేవంత్‌రెడ్డి మొగ్గుచూపినట్టు తెలిసింది. ఇక్కడి నుంచి టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేసిన పార్టీ సీనియర్ నేత అంజన్ కుమార్ యాదవ్, బొంతు రామ్మోహన్‌కు మొండిచెయ్యి చూపినట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముస్లిం ఓటర్ల తర్వాత యాదవ సామాజికవర్గం ఓట్లే ఎక్కువ ఉండటం, ముస్లిం మైనార్టీయేతర అభ్యర్థిని నిలబెడితేనే తమ పార్టీ మద్దతు కాంగ్రెస్‌కు ఉంటుందని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చేసిన సూచనలకు అనుగుణంగానే కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సీఎం రేవంత్‌రెడ్డి నివాసంలో శనివారం సాయంత్రం కీలక సమావేశం జరిగింది. ఈ భేటీకి పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఇన్చార్జి మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్రావు, గడ్డం వివేక్, ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్, జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధి కార్పొరేటర్లు హాజరయ్యారు. అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ నేతలు కసరత్తు చేసి పార్టీ తరఫున టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ చేయించిన రహస్య సర్వేను సీఎం, మంత్రుల ముందు పెట్టినట్టు తెలిసింది.
చక్రం తిప్పిన మజ్లిస్.. నవీన్‌కే టికెట్
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సుమారు 70 వేల మంది మైనార్టీ ఓటర్లున్నారు. ఆ తర్వాత యాదవ సామాజికవర్గ ఓటర్లే ఎకువ సంఖ్యలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం సహకారం కోరింది. అయితే మైనార్టీ లీడర్‌కు కాకుండా ఇతరులెవరికి టికెట్ ఇచ్చినా తమకు అభ్యంతరం లేదని, కాంగ్రెస్‌కు మద్దతిస్తామని , తమ పార్టీ అభ్యర్థిని బరిలో దించబోమని ఎంపీ అసదుద్దీన్ ప్రకటించారు. ఆయన ప్రకటనకు అనుగుణంగానే ఈ రోజు భేటీలో కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. సీక్రెట్ సర్వేలు చేయించిన టీపీసీసీ, ఆశావాహుల లిస్టును వడగట్టి సీఎం రేవంత్‌రెడ్డి ముందు పెట్టినట్టు తెలిసింది. చిన్నశ్రీశైలం యాదవ్ కుమారుడు నవీన్ యాదవ్, అంజన్‌కుమార్ యాదవ్, అనిల్ కుమార్ యాదవ్, బొంతు రామ్మోహన్ తదితరుల పేర్లతో ఫైనల్ లిస్టు తయారు చేసి సమర్పించగా అంతిమంగా నవీన్‌కుమార్ యాదవ్ వైపే రేవంత్‌రెడ్డి మొగ్గు చూపినట్టు తెలిసింది.
ముగ్గురు మంత్రులకు సూచనలు
ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గ బాధ్యతలను ముగ్గురు మంత్రులకు అప్పగించింది. నియోజకవర్గాన్ని మూడు భాగాలుగా విభజించింది. ఒకో మంత్రికి రెండు డివిజన్ల చొప్పున కేటాయించింది. మంత్రులు పొన్నం ప్రభాకర్‌గౌడ్, తుమ్మల నాగేశ్వర్రావు, గడ్డం వివేక్‌కు బాధ్యతలు అప్పగించింది. ప్రతి మంత్రికి ఆరుగురు కార్పొరేటర్ల చొప్పున మొత్తం 18 మందిని సహాయకులుగా పెట్టింది. డివిజన్ల వారీగా మంత్రులు తెచ్చిన సమాచారంపై సమావేశంలో ప్రాథమికంగా చర్చ జరిగినట్టు తెలిసింది. డబ్బుకు వెనుకాడకుండా గల్లీ స్థాయి నేతలను పార్టీలోకి లాగాలని వారికి రేవంత్‌రెడ్డి సూచించినట్టు తెలిసింది.