మహబూబ్‌నగర్ అర్బన్, జనవరి 30: తప్పుడు ప్రచారంతో, అమలు సాధ్యంకాని హామీలిచ్చి కాం గ్రెస్ అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వ హయాం లో పాలమూరు జిల్లా ఎంతో అభివృద్ధి సాధించిందని.. కానీ, ప్రజలకు వివరంగా చెప్పలేకపోయామని పేర్కొన్నారు.
మంగళవారం మహబూబ్‌నగర్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డితో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. ఆరు గ్యారెంటీలు అని ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. కర్ణాటకలో కూడా ఇలాగే కొనసాగుతున్నదని ధ్వజమెత్తారు.
ప్రజాపాలన పేరుతో తీసుకున్న దరఖాస్తులను పరిష్కరించలేదని మండిపడ్డారు. మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్, బీజేపీ కలిసి పనిచేశాయని, రాష్ట్రంలో ఎక్కడా కూడా ఇలా జరగలేదని విరుచుకుపడ్డారు. ఐదేండ్లు ఎంపీగా మన్నె ఎన్నో సేవలు అందించారని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ గెలుపునకు ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. గాంధీ వర్ధంతి సందర్భంగా తొలుత గాంధీ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి చంద్రశేఖర్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు.