Congress | హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రియల్ఎస్టేట్ రంగానికి గడ్డుకాలం మొదలైందని వ్యాపారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే టీఎస్ బీపాస్ ద్వారా అనుమతులపై ఆంక్షలు విధించిందని, కొత్త నిర్మాణాలకు అనుమతులు ఇవ్వలేదని చెప్తున్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే టీజీబీపాస్ అనుమతులు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు నిలిపి వేయడంతో కొత్త భవనాలు లేక, కట్టిన భవనాలను కొనుగోలుదారులకు అప్పగించలేక రియల్ఎస్టేట్ వ్యాపారులు, నిర్మాణ సంస్థలు అల్లాడిపోయాయి. ఏప్రిల్, మే వరకు ఈ పరిస్థితి కొనసాగింది. కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నాలుగు నెలల్లో పదిలోపే హైరైజ్ బిల్డింగ్‌లకు అనుమతులు ఇచ్చింది. ఎన్నికలకు తోడు లావాదేవీలపై ఆంక్షల ఫలితంగా జీహెచ్ఎంసీకి గత ఆర్థిక సంవత్సరంలో రూ.300 కోట్ల మేర ఆదాయం పడిపోయిందని చెప్తున్నారు.
జూన్‌లో కాస్త పరిస్థితి చక్కబడ్డదని అనుకునేలోగా పిడుగులాగా హైడ్రా, మూసీ ప్రాజెక్టులు తమ మీద పడ్డాయని రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. హైడ్రా భయంతో చెరువుల చుట్టూ ఉన్న భవనాలు, వెంచర్ల దిక్కు చూసేవారే కరువయ్యారని అంటున్నారు. మరోవైపు, ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వృద్ధికి ప్రోత్సాహం ఇవ్వకపోగా, ఫోర్త్‌సిటీ నామాన్ని జపించింది. ఎంత ప్రచారం చేసినా ఫోర్త్‌సిటీ వైపు రియల్టర్లు దృష్టిసారించకపోవటంతోనే హైడ్రా, మూసీని తెరమీదకు తెచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. తీరా రైతుల పోరాటంతో అక్కడ ఫార్మాసిటీ కొనసాగిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో అటు ఉన్న సిటీకి, ఇటు ఫోర్త్‌సిటీ పోయిందని రియల్ఎస్టేట్ వ్యాపారులు అంటున్నారు.
కాంగ్రెస్ పెద్దలు రియల్ఎస్టేట్ రంగాన్ని తమ వసూళ్లకు వాడుకుంటున్నారని మొదటినుంచీ ఆరోపణలు వినిపిస్తున్నాయి.వసూళ్లకు ప్రత్యేకంగా ఒక వ్యక్తిని నియమించినట్టు రియల్ఎస్టేట్ వర్గాలే ఆరోపించాయి. నిర్మాణాలయితే చదరపు అడుగుకు రూ.40, వెంచర్లయితే చదరపు గజానికి రూ.200 వరకు వసూలు చేసినట్టు ఆరోపణలొస్తున్నాయి.
ప్రభుత్వ అడ్డగోలు నిర్ణయాలతో రాష్ట్రంలో నిర్మాణ రంగం కుదేలయ్యిందని వ్యాపారులు వాపోతున్నారు. ఈ ఏడాది జీఎస్టీ వసూళ్లు పెద్దగా పెరగకపోవడానికి ఇది కూడా ఒక కారణమని అంటున్నారు. కొత్త ప్రాజెక్టులు లేకపోవడంతో అనుబంధ రంగాలకు మున్ముందు మరింత గడ్డుకాలం తప్పదని స్పష్టం చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు.
మార్కెట్లో ఇండ్ల అమ్మకాల్లేక స్టీల్, సిమెంట్ విక్రయాలూ అంతంతమాత్రంగానే సాగుతున్నాయి. నగదు కొరతతో చాలామంది నిర్మాణాలను సగంలోనే ఆపేస్తున్నారు. తెలిసినవాళ్లు కదా అని సరకు ఉద్దెర ఇచ్చాం. ఇప్పుడు ఆ పైసలన్నీ రిస్కులో పడ్డాయి.