నిజామాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్ర మంత్రివర్గ కూర్పు పై రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చ నడస్తున్నది. బీజేపీ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మంత్రివర్గంలో చోటు దక్కకపోవ డం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో మొత్తం 17 ఎంపీ స్థానాలు ఉండగా.. కాంగ్రెస్ నుంచి ఎనిమిది మంది ఎంపీ లు, బీజేపీ నుంచి ఎనిమిది మంది, ఎం ఐఎం నుంచి ఒకరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మహబూబ్‌నగర్, కరీంనగర్, ని జామాబాద్, ఆదిలాబాద్, మెదక్, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గాల నుంచి బీజేపీ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తుండగా.. ఇందులో మహబూబ్‌నగర్, కరీంనగర్ ఎంపీ స్థానా ల పరిధిలోని వారికి మాత్రమే మంత్రి పదవులు దక్కాయి. వీరిలో సీఎం రేవంత్ ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంతోపాటు, కొత్తగా మంత్రి పదవి పొందిన వాకిటి శ్రీహరి నియోజకవర్గం మక్తల్ కూడా మహబూబ్‌నగర్ ఎంపీ స్థానం పరిధిలో ఉన్నాయి.
పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్నాబాద్ కరీంనగర్ ఎంపీ స్థానం పరిధిలో ఉన్నది. ఇక మిగిలిన బీజేపీ ఎంపీ లు ప్రాతినిధ్యం వహిస్తున్న నిజామాబా ద్, ఆదిలాబాద్, మెదక్, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి స్థానాల పరిధిలో ఏ ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యేకు గానీ, ఎమ్మెల్సీకిగాని మంత్రి పదవి దక్కకపోవడం గమనార్హం. బీజేపీ, కాంగ్రెస్ మధ్య కొనసాగుతున్న లోపాయికారి ఒప్పందంలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ కావాలనే మంత్రులను నియమించలేదన్న అభిప్రాయం సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నది.
అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పరస్పర సహకారంతో విజయాలు సాధించిన ఫలితంగానే ఈ మేరకు సర్దుబాట్లు ఏమైనా జరిగియా? అనే కోణంలో చర్చ నడుస్తున్నది. బీజేపీ ఎంపీలుగా పోటీచేసిన వారు తమ గెలుపు కోసం కాంగ్రెస్ నేతలతో చేతులు కలప డం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా పోటీచేసిన వారంతా బీజేపీ ఎంపీ అభ్యర్థులకు సహకరించడం వంటి కారణాలు ఇందులో ఇమిడి ఉన్నాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. గవర్నర్ బండారు దత్తాత్రేయ పుస్తకావిష్కరణ సభలో మోదీ స్కూల్లో, చంద్రబాబు కాలేజీలో చదువుకుని రాహుల్‌గాంధీ వద్ద ఉద్యోగం చేస్తున్నానంటూ రేవంత్ చేసిన నర్మగర్భ వ్యాఖ్యలు ఇందు కు బలాన్ని చేకూరుస్తున్నాయని కాంగ్రెస్, బీజేపీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
రేవంత్ క్యాబినెట్లో ఉత్తర తెలంగాణ ప్రాంతం తీవ్ర వివక్షకు గురవుతున్నది. 2023లో కొలువుదీరిన ప్రభుత్వంలో ని జామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల నుంచి ఏ ఒక్కరికీ మంత్రి పదవి దక్కలేదు. 18 నెలల తర్వాత చేపట్టిన మంత్రివర్గ విస్తరణలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి గడ్డం వివేక్‌కు స్థానం దక్కింది. ఈసారి కూడా నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలకు మొండిచేయి తప్ప లేదు. ఇన్చార్జి మంత్రుల మీదనే ఆధారపడటంతో ఎమ్మెల్యేలకు సఖ్యత కొరవడి పాలనా వ్యవహారాలు కుంటుపడుతున్నాయనే విమర్శలున్నాయి. మంత్రివర్గ విస్తరణలో భౌగోళిక సమతుల్యం దెబ్బతిన్న ట్టు అర్థమవుతున్నది.
గతంలో ఉమ్మడి జిల్లా ప్రాతిపాదికన మంత్రులకు ప్రాతినిధ్యం ఉండేది. ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్‌లో కాంగ్రెస్ నుంచి నలుగురు ఎమ్మెల్యేలున్నప్పటికీ ఒక్కరికీ మంత్రి పదవి దక్కలేదు. హైదరాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అత్యధిక మంది ఉన్నారు. అరకొరగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలున్నప్పటికీ కాంగ్రెస్ వారిని విస్మరించింది. కనీసం ప్రభుత్వ విప్ వంటి పోస్టులు కూడా దక్కలేదు. మంత్రివర్గంలో రాజధానిలోని నాయకులకు చోటు దక్కకపోవడం చరిత్రలో ఇదే ప్రథమమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మూడు జిల్లాలకు క్యాబినెట్లో అసలు ప్రాతినిధ్యమే లేకపోవడం, బీజేపీ ఎంపీలున్న ఆరు నియోజకవర్గాల్లో ఏ ఒక్కరికీ మంత్రి పదవులు దక్కకపోవడంపై కాంగ్రెస్ నేతలు సైతం విస్మయం వ్యక్తంచేస్తున్నారు.