వరంగల్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వైఖరిపై పాత కాంగ్రెస్ క్యాడర్ భగ్గుమన్నది. ఇందిరమ్మ కమిటీల ఎంపికపై అసంతృప్త జ్వాలలు రగులుకున్నాయి. తొలి నుంచి పాత, కొత్త కాంగ్రెస్ క్యాడర్ నడుమ పొడచూపిన విభేదాలు బుధవారం ఒక్కసారిగా రోడ్డెక్కాయి. ఊరూరా ఇందిరమ్మ కమిటీల్లో తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని ధర్మసాగర్ మండల కేంద్రంలో ఏకంగా పాతకాంగ్రెస్ క్యాడర్రాస్తారోకోకు దిగింది. మండల కాంగ్రెస్ కో ఆర్డినేటర్ భిక్షపతి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆయన వైఖరిని తప్పుబట్టారు.
ఇందిరమ్మ కమిటీలే కాకుండా, కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాలు తమకు తెలియకుండానే నిర్వహిస్తూ వస్తున్నారని మండిపడ్డారు. రోడ్డుపైనే కడియం శ్రీహరి దిష్టిబొమ్మ దహనం చేసేందుకు రెడీ అయ్యారు. అయితే కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిన సింగాపురం ఇందిర ఫోన్లో నచ్చజెప్పడంతో కార్యకర్తలు దిష్టిబొమ్మ దగ్ధాన్ని విరమించుకున్నారు. ప్రతిపక్షంలో ఉన్న పదేండ్లు కాంగ్రెస్ కోసం కష్టపడ్డామని, కడియం శ్రీహరి కొత్తగా వచ్చి తమను పక్కనబెడుతున్నారని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు.