మా ఇండ్ల జోలికి ఉయ్యాలో..!
మీరు రావొద్దయ్య ఉయ్యాలో..!
బతుకు వెతలను కైగట్టుకున్న ఇదే పాట నిరుడు మూసీ తీరంలో మార్మోగింది. కాంగ్రెస్ సర్కారుపై, ముఖ్యమంత్రి రేవంత్ తీరుపై, హైడ్రా సాగిస్తున్న బుల్డోజర్ రాజ్‌పై ఆగ్రహాన్ని, ఆక్రోశాన్ని చైతన్యపురి, కొత్తపేట డివిజన్లలో మహిళలు బతుకమ్మ ఆడుతూ వెళ్లగక్కారు. ఏడాది దాటినా పరిస్థితి మారలేదు. పేదోడి గూడుపై సర్కారు పగ చల్లారలేదు. బుల్డోజర్ గాండ్రింపులూ ఆగలేదు.
ఆదివారం నాడు ఎంగిలిపూలతో బతుకమ్మ సంబురాలను జరుపుకొనేందుకు సిద్ధమైన మేడ్చల్ జిల్లా గాజులరామారం బస్తీపై పొద్దుపొద్దున్నే హైడ్రా పంజా విసిరింది. ఉన్నపళంగా విరుచుకుపడిన బుల్డోజర్లతో పేదలు హతాశులయ్యారు. వారికండ్ల ముందే ఇండ్లు టపాటపా కూలిపోయాయి. ఒక్కటి కాదు.. రెండు కాదు.. మొత్తం 275 నివాసాలు! జనం ఆక్రందనల మధ్య కూల్చివేతలు కొనసాగాయి. చివరికి ఆక్రోశంతో పేదలు కూలిన కలల శిథిలాల మధ్య కన్నీటిపాట పాడుతూ బతుకమ్మ ఆడారు.
హైడ్రా వచ్చింది ఉయ్యాలో.. రోడ్డు పాలైతిమి ఉయ్యాలో..
హైడ్రా వచ్చింది ఉయ్యాలో.. దానింట్ల పీనుగెల్ల ఉయ్యాలో..
బతుకమ్మ వచ్చింది ఉయ్యాలో.. పండుగే లేదాయె ఉయ్యాలో..
మేం గరీబోళ్లం ఉయ్యాలో.. బతుకమ్మ లేదాయె ఉయ్యాలో..
మా అందరింట్ల ఉయ్యాలో .. పండుగే లేదాయె ఉయ్యాలో..
కట్టుబట్టలులేవాయోఉయ్యాలో.. ఎక్కడని పోదుమూ ఉయ్యాలో..
ఎవనింటికెలుదుం ఉయ్యాలో.. పండుగా పూట ఉయ్యాలో
హైడ్రా వచ్చింది ఉయ్యాలో.. దానింట్ల పీనుగెల్ల ఉయ్యాలో..
– ఇది హైడ్రా బాధితుల బతుకమ్మ పాట
దుండిగల్, సెప్టెంబర్ 21: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గాజులరామారంలో హైడ్రా మరోమారు పడగవిప్పింది. ప్రభుత్వ భూములను కబ్జా చేశారనే నెపంతో వందలాది ఇండ్లను నేలమట్టం చేసింది. పేదల బతుకులు రోడ్డున పడేసింది. పేదలు తమ గూడును కూల్చవద్దంటూ వేడుకున్నా కనికరించని అధికారులు.. బుల్డోజర్లతో నిర్మాణాలను నేలమట్టం చేశారు. ఇండ్లల్లోని సామాన్లు బటయకు తీయించి మరీ.. కూల్చివేతలు చేపట్టారు. దీంతో నిరుపేదల నుంచి నిరసన, ప్రతిఘటన ఎదురైంది. గాలిపోచమ్మ బస్తీకి చెందిన మహిళలు తమ ఇంటి సామాన్ల చుట్టూ బతుకమ్మ ఆట ఆడుతూ హైడ్రా, ముఖ్యమంత్రి తీరును ఎండగట్టారు.
మరికొందరు కేబుల్‌వైర్లను పట్టుకుని, రోడ్డుకు అడ్డంగా పడుకుని నిరసన తెలిపారు. అబిద్బస్తీలో కూల్చివేతలు చేస్తుండగా పలువురు జేసీబీపై రాళ్లువిసిరి ప్రతిఘటించారు. బస్తీకి చెందిన పలువురిని జగద్గిరిగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. శనివారం ఉదయం 7:30 గంటలకు మొదలైన కూల్చివేతలు, మధ్యాహ్నం 3 గంటల వరకు జరిగాయి. నిరుడు ఆగస్టు 6న ఇదే తరహాలో గాజులరామారంలోని చింతల్‌చెరువు దగ్గరలోని దాదాపు 100 ఇండ్లను కూల్చిన హైడ్రా.. మళ్లీ ఆదివారం బుల్డోజర్ కోరలు చాచింది.
ఆదివారం ఉదయం 7:30 గంటల నుంచే దేవేందర్‌నగర్‌లోని కుత్బుల్లాపూర్ మండల రెవెన్యూ కార్యాలయం వద్దకు పెద్దసంఖ్యలో హైడ్రాకు చెందిన వాహనాలు చేరుకున్నాయి. వందల సంఖ్యలో హైడ్రా, పోలీసు సిబ్బంది రావడంతో స్థానికుల్లో కలవరం మొదలైంది. స్థానికులు ఊహించినట్టుగానే రెవెన్యూ, పోలీస్, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి హైడ్రా సిబ్బంది సర్వేనంబర్ 307లోని గాలిపోచమ్మ (నర్సింహ)బస్తీపై దండెత్తారు. ఎదురైన ప్రతీ ఇంటిని నేలమట్టం చేశారు. మొదట్లో ఇంట్లో జనాలు ఉంటే కూల్చబోమని అధికారులు చెప్పినప్పటికీ.. అది గాలిమాటగానే మారింది. ఇండ్లల్లో ఉన్న వారిని బలవంతంగా బయటకు పంపించడంతోపాటు సామాన్లను బటయపడేసి కూల్చివేతలు చేపట్టారు. అలా ఉదయం 7:30 గంటలకు మొదలైన కూల్చివేతలు మద్యాహ్నం 3 గంటల వరకు కొనసాగాయి. సర్వేనంబర్ 307లోని నర్సింహబస్తీ, రాజురాజేంద్ర బస్తీతోపాటు సర్వేనంబర్ 342లోని అబిద్బస్తీ, బాలయ్యనగర్ బస్తీలోని సుమారు 275కిపైగా ఇండ్లను కూల్చివేశారు.
కూలీనాలీ పనులను చేసుకునే తాము పైసాపైసా కూడబెట్టి స్థలాన్నికొనుగోలు చేసుకుని… చిన్న, చిన్న ఇండ్లు కట్టుకుంటున్నామని స్థానికులు విలపించారు. తమ గూడును కూల్చొద్దని అధికారులను ప్రాధేయపడ్డారు. అయినా అధికారులు కనికరించలేదు. ఇండ్లను నేలమట్టం చేయడంతో ప్రజలు ఆర్తనాదాలు చేశారు. కూలిన ఇంటి ముందు సామాన్లు పెట్టుకుని, కిరాయి ఇండ్లు వెతికేందుకు వెళ్లిపోయారు. ఇండ్ల ముందు చిన్నారులు కూర్చుని తల్లిదండ్రులు రాకకోసం.. ఆకలితో ఎదురుచూడటం కనిపించింది. కరెక్టుగా అన్నం వండే సమయంలోనే హైడ్రా అధికారులు తమను బయటకు గెంటేసి తమ ఇంటిని కూల్చివేశారని చిన్నారులు చెప్పడం అందరినీ కలిచివేసింది. తమ పుస్తకాలు, బట్టలు, సామాన్లు కూడా ఇంటిలోనే ఉండిపోయాయని తెలిపారు. పండుగపూట ఇండ్లను కూలిస్తే ఎక్కడికి వెళ్లాలంటూ విలపించారు.
గాజులరామారంలో హైడ్రా చేపట్టిన కూల్చివేతలపై స్థానికుల నుంచి తీవ్రనిరసన, ప్రతిఘటన వ్యక్తమైంది. ఇండ్లు కోల్పోయిన పలువురు మహిళలు రోడ్డుకు అడ్డంగా విద్యుత్తు కేబుల్ పట్టుకుని నిరసన తెలిపారు. మరి కొందరు మహిళలు హైడ్రా సిబ్బంది బయట పడవేసిన తమ సామాన్లను రోడ్డుపై పెట్టి.. బతుకమ్మ ఆడారు. హైడ్రా, సీఎం వైఖరిని ఎండగట్టారు… శాపనార్థాలు పెట్టారు. గాలిపోచమ్మ బస్తీలో కూల్చివేతలు ముగించుకున్న హైడ్రా అధికారులు పక్కనే ఉన్న అబిద్బస్తీలో కూల్చివేతలకు వెళ్లారు. అక్కడ స్థానికులకు కడుపుమండి.. జేసీబీపై రాళ్లదాడికి దిగారు. జగద్గిరిగుట్ట పోలీసులు ఏడుగురిని అదుపులోకి తీసుకుని పీఎస్‌కు తరలించారు. రాళ్లదాడి ఘటనలో రెవెన్యూ అధికారులు తమకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని పోలీసులు చెప్తున్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి 2019లో మల్కాజిగిరి ఎంపీగా పోటీచేసిన సమయంలో గాజులరామారం చౌరస్తాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సందర్భాన్ని స్థానికులు గుర్తుచేస్తున్నారు. పేదల భూములకు పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చి ఓట్లు వేయించుకున్న రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు తమను రోడ్డున పడేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన సీఎం అయ్యాక తమకు పట్టాలు వస్తాయని, తలరాత మారుతుందని అనుకుంటే.. హైడ్రాపేరిట తమ బతుకులు ఆగం చేశాడని వాపోయారు. తమతో పాటు బౌరంపేట్, దుండిగల్‌లోని ప్రభుత్వ భూములల్లో నివాసముంటున్న వారి ఇండ్లను రెగ్యులరైజ్ చేయిస్తానన్న మాటా మరిచి, ఇండ్లను కూలగొట్టించాడని ఆవేదన వ్యక్తంచేశారు.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారం రెవెన్యూ పరిధిలోని సర్వేనంబర్ 307, 342, 349లో సుమారు 350 ఎకరాల ప్రభుత్వ భూములు ఉండగా అందులోని 100 ఎకరాల భూములను స్టేట్‌ఫైనాన్స్ కార్పొరేషన్‌కు, మరికొంత ప్రభుత్వ భూమిని పలు ఇతర సంస్థలకు 2014కు ముందు ఉన్న ప్రభుత్వాలు కేటాయించాయి. ఆ భూములను పొందిన సంస్థలు సరైన రక్షణ చర్యలు చేపట్టలేదు. ఈ నేపథ్యంలో కబ్జాదారులు ప్రవేశించి, స్థానిక రెవెన్యూ అధికారులను మచ్చిక చేసుకుని కబ్జాలకు శ్రీకారం చుట్టారు. అలా వందలాది ఎకరాలను పదుల సంఖ్యలో అక్రమార్కులు కబ్జా చేశారు. ప్రభుత్వ భూములను 100, 80, 60 గజాల ప్లాట్లుగా విభజించి, విక్రయించి.. కోట్లాది రూపాయలను వెనుకేసుకున్నారు. అయితే ఒక్క సర్వేనంబర్ 307లోనే సుమారు రూ.1500 కోట్ల విలువ చేసే ప్రభుత్వభూమి కబ్జాకు గురైనట్టు ఆరోపణలు రావడంతో మేడ్చల్ జిల్లా కలెక్టర్ మనుచౌదరి ఆదివారం ఉదయం గాజులరామారంలోని భూములను పరిశీలించి, కబ్జాలను తొలగించాలని రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు
మా ఇండ్లు కూలగొట్టిండ్రు .ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నరు. ఇప్పుడు మా ఇల్లు కూలింది. పిల్లల గురించి అయినా సీఎం ఆలోచన చేయాలి కదా. ఎన్నికల సమయంలో ఓట్లకోసం మమ్మల్ని వాడుకుని వదిలేస్తున్నరు. మాకు న్యాయం జరగాలి. గడిచిన ఇరవై ఏండ్లుగా ఇక్కడే ఉంటున్నం. అధికారులు మాకు ముందే సమాచారం ఇచ్చి ఉంటే మా జాగ్రత్తలో మేం ఉండేవాళ్లం. పేదలం కాబట్టే అధికారులు ఇట్లా చేస్తుండ్రు. ఇండ్లు కూల్చిన హైడ్రా అధికారులు మా బతుకులను బజారున పడేసిండ్రు.
-కవిత, బాలయ్యనగర్బస్తీ
మేము డబ్బు లు పెట్టి ఇండ్ల జాగలు కొన్నం. మాకు ఇక్కడి కొందరు వ్యక్తులు నోటరీ చేసి అమ్మి న్రు. ఇవి ప్రభుత్వ భూములని మాకు తెలియదు. గతంలో ఒకసారి ఇలాగే రెవెన్యూ అధికారులు మా ఇంటిని కూల్చారు. అప్పుడే మాకు ఈ ఇండ్లు వద్దు.. మా డబ్బులు మాకు ఇవ్వాలని అడిగాం. మేము ఉన్నాం కదా, మీకు ఏమీ కాదు అన్నారు. కరెంట్ మీటర్లు, ఇతర వసతులు ఏర్పాటు చేశారు. దీంతో ఏమీ కాదని అనుకున్నాం. కానీ ఇపుడు నిండా మునిగాం.
– స్థానికురాలు, గాలిపోచమ్మబస్తీ, గాజులరామారం
అధికారులకు తెలిసే ఈ నిర్మాణాలు అన్నీ జరిగాయి. రెవెన్యూ, పోలీసు అధికారుల పాత్ర ఇండ్ల నిర్మాణాలల్లో ఎంతో ఉంది. అందరికీ ముడుపులు ముట్టాకే పేదలు ఇక్కడ ఇండ్లను కట్టుకున్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు నిజంగా దమ్ముంటే లంచాలు తీసుకుని కబ్జాలను ప్రోత్సహించిన అధికారులను సస్పెండ్ చేయాలి.
-నర్సింగరావు, మహా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు