కొల్చారం, డిసెంబర్ 15: మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేటలో (Rangampet) బీఆర్ఎస్ (BRS) నేతలు ప్రచారం చేస్తుండగా కాంగ్రెస్ (Congress) నాయకులు గొడవకు యత్నించారు. బీఆర్ఎస్ నాయకులను తోసేసి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. సోమవారం చివరిరోజు ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి కొల్చారం మండలంలోని యెనిగండ్ల, కోనాపూర్, పైతర, తుక్కాపూర్‌లో ఎన్నికల ప్రచారం చేసి రంగంపేటకు చేరుకున్నారు. రంగంపేటలో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి అరిగె స్వర్ణలత విజయ్‌కుమార్‌తో కలిసి ఎమ్మెల్యే ప్రచారం ప్రారంభించి, ఇంటింటికీ తిరుగుతూ పెద్ద మీది బజారుకు చేరుకున్నారు. కాంగ్రెస్ నాయకులు రెచ్చగొట్టే విధంగా అదే రోడ్డులో పాటలు పెట్టి నృత్యాలు చేస్తున్నారు.
గన్మెన్ల సహాయంతో ఎమ్మెల్యే ముందుకు వెళ్లగా, వెనుక వస్తున్న బీఆర్ఎస్ నాయకులను పలువురు కాంగ్రెస్ నాయకులు తోసేశారు. దీంతో ఇరువర్గాల మధ్య కొద్దిసేపు తోపులాట జరిగింది. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని చక్కదిద్దారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ఓటమి భయంతోనే కాంగ్రెస్ నాయకులు గొడవలకు దిగుతున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్ నాయకులు ఉద్దేశపూర్వకంగానే ఎమ్మెల్యే ప్రచారాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, రంగంపేట సొసైటీ చైర్మన్ అరిగె రమేశ్ ఆరోపించారు. ఎన్ని కుయుక్తులు పన్నినా రంగంపేటలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి అరిగె స్వర్ణలత గెలిచి తీరుతుందని ధీమా వ్యక్తంచేశారు.