యాదాద్రి భువనగిరి : స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిందే కాంగ్రెస్, బీజేపీ పార్టీలని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు. సుదీర్ఘకాలం కేంద్రంలో అధికారం చేలాయించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం స్థానిక సంస్థలను నిర్లక్ష్యం చేస్తే ఆ తరువాత అధికారంలోకి వచ్చిన బీజేపీ పాలకులు స్థానిక సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆయన దుయ్యబట్టారు.
స్థానిక సంస్థలకు శాసనమండలి కోటాలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం భువనగిరి, ఆలేరు, నకిరేకల్ నియోజకవర్గాల ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి అతిథిగా పాల్గొన్నారు. యాదాద్రి జిల్లా కేంద్రంలో భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల సన్నాహక సమావేశంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి, జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి పాల్గొనగా, నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలో జరిగిన సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అధ్యక్షత వహించగా జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి,శాసన మండలి సభ్యులు గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన సభ్యులు శానంపూడి సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జరిగిన సమావేశాలలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణాలో వ్యవసాయం, విద్యుత్ రంగాలలో సంక్షోభం సృష్టించేందుకు బీజేపీ కుట్రలు పన్నుతోందని అందుకు ఇక్కడి కాంగ్రెస్ వత్తాసు పలుకుతుందని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఎదుర్కొనే ప్రక్రియ లో ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ లు చెట్టాపట్టాలేసుకుని పనిచేస్తున్నాయని ఆయన విమర్శించారు.
మోదీ సర్కార్ కొత్తగా తెచ్చిన విద్యుత్, వ్యవసాయ చట్టాలు అందుకు నిదర్శనమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఖ్యాతి హస్తినకు పాకిందని, అది తట్టుకోలేకనే ఆ రెండు పార్టీలు ఈ కుట్రలకు తెరలేపుతున్నాయన్నారు. అందుకు కారణం విద్యుత్,వ్యవసాయ రంగాలలో ముఖ్యమంత్రి కేసీఆర్ సాధించిన అద్భుతమైన విజయాలే కారణమన్నారు.
ధాన్యం కొనుగోలు చేసే ప్రసక్తి లేదని ఒకవైపు కేంద్రం చెబుతుంటే బాధ్యత లేని ఇక్కడి నాయకత్వం అందుకు భిన్నంగా వ్యహరించడం రైతాంగంలో అయోమయం సృష్టించెందుకే నని ఆయన విమర్శించారు. తెలంగాణ సమాజం ఎప్పుడూ తనదైన చైతన్యాన్ని చాటుకుంటుందని ఆయన తెలిపారు. బాధ్యత లేని బండి సంజయ్ లాంటి నేతలు కల్లాల వద్దకు వస్తుంటే ఇక్కడి సమాజం అటువంటి చైతన్యాన్ని చాటిందని ఆయన అభినందించారు.
రేపటి శాసనమండలి ఎన్నికల్లోనూ అదే చైతన్యాన్ని చాటేందుకు ఓటర్లు సన్నద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. స్థానిక సంస్థలకోటాలో శాసన మండలి కి జరగబోయే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ సాధించిన జిల్లాగా నల్లగొండ జిల్లా రికార్డ్ నమోదు చేసుకోబోతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.