సిద్దిపేట ప్రతినిధి/ సిద్దిపేట, ఆగస్టు 20(నమస్తే తెలంగాణ) : రుణమాఫీపై సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన డ్రామా బేవార్స్ అని, పిడికెడు మందికే రుణమాఫీ అయిందని, లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలేదని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ చెప్పారు. రైతులకు సంపూర్ణ రుణమాఫీ సాధన కోసం సిద్దిపేట లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం కార్యాచరణ సమావేశం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు వంటేరు ప్రతాప్‌రెడ్డి, దేవీప్రసాద్, ఎర్రోళ్ల శ్రీనివాస్‌తో కలిసి దేశపతి మాట్లాడారు. రుణమాఫీ అయిపోయిందని ముఖ్యమంత్రి చెబుతుంటే.. ఇంకా పూరి కాలేదని మంత్రులు ఉత్తమ్, పొంగులేటి చెబుతున్నారని, ఎమ్మెల్సీ కోదండరాం కూడా పాక్షికంగానే రుణమాఫీ జరిగిందని చెబుతున్నారని తెలిపారు. దేవుళ్ల మీద ఒట్టుపెట్టి రుణమాఫీ చేస్తానన్న రేవంత్‌రెడ్డి, నోరు ప్రక్షాళన చేసుకోవాలని ఎద్దేవా చేశారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు, సంపూర్ణ రుణమాఫీ చేస్తేనే రాజీనామా చేస్తానని హరీశ్‌రావు సవాల్ విసిరితే పారిపోయి నేడు పాక్షికంగా రుణమాఫీ చేసి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు.
ప్రభుత్వాన్ని నిలదీస్తాం : దేవీప్రసాద్
హరీశ్‌ను రాజీనామా చేయాలనే నైతిక హక్కు కాంగ్రెస్ నాయకులకు లేదని దేవీప్రసాద్ అన్నారు. పదవులకు రాజీనామాలు చేసుడు బీఆర్ఎస్కు కొత్తకాదని స్పష్టంచేశారు. ప్రభుత్వం హామీలు అమలు చేసేలా ప్రధాన ప్రతిపక్షంగా నిలదీస్తామని చెప్పారు. హామీలు అమలు చేయాలని కోరితే ఎదురు దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. మైనంపల్లి సిద్దిపేట పర్యటన గురించి మాట్లాడడం ఇష్టం లేదని చెప్పారు.
మైనంపల్లికి సిద్దిపేటలో ఆధార్కార్డున్నదా? : ఎర్రోళ్ల శ్రీనివాస్
మైనంపల్లిని ప్రజలు రాజకీయాల నుంచి ఎప్పుడో తిరస్కరించారని, మెదక్‌లో పద్మాదేవేందర్‌రెడ్డి చేతిలో, మల్కాజిగిరిలో ఓడిపోయిన చరిత్ర ఆయనదని మైనంపల్లికి, సిద్దిపేటకు ఏం సంబంధమని ఎర్రోళ్ల శ్రీనివాస్ నిలదీశారు. హరీశ్‌ను రాజీనామా చేయాలని మైనంపల్లి అడగడం సిగ్గు చేటని, మైనంపల్లికి సిద్దిపేటలో ఆధార్ కార్డు ఉన్నదా అని ప్రశ్నించారు. ‘నీకు దమ్ము, ధైర్యం ఉంటే నీ కొడుకు రోహిత్‌ను మెదక్‌లో రాజీనామా చేయించి.. మళ్లీ గెలిపించు’ అని సవాల్ చేశారు. దేశ మొదటి ప్రధాని నెహ్రూ ఫొటోలు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్నట్టే తెలంగాణను తెచ్చిన మహానీయుడు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఫొటోలు ఉండడం కూడా అంతే అవసరమని చెప్పారు.
అబద్ధాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ : మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి
మోసపూరిత వాగ్దానాలు, అబద్ధపు ప్రచారాలతో కాంగ్రెస్ గద్దెనెక్కిందని, ఎనిమిది నెలల్లో ప్రజలకు ఒరగబెట్టిందేమి లేదని మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి విమర్శించారు. హరీశ్‌రావు ఒత్తిడి వల్లే ప్రభుత్వ ఈ మాత్రం రుణమాఫీ చేసిందని గుర్తుచేశారు. మహిళలకు రూ.2500 మహాలక్ష్మి స్కీమ్ ఇస్తామని చెప్పి ఆ ఊసే ఎత్తడం లేదని జిల్లాలకు రూపాయి నిధులు కూడా ఇవ్వలేదని, కనీసం పారిశుద్ధ్యం కోసం సమీక్షలు చేసిన దాఖలాలు లేవని దుయ్యబట్టారు.
సిద్దిపేటలో రోజంతా టెన్షన్
సిద్దిపేటలో మంగళవారం రోజంతా టెన్షన్ వాతావరణం నెలకొన్నది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటాపోటీ సమావేశాలు, ర్యాలీలతో పట్టణంలో పొలిటికల్ హీట్ పుట్టింది. రుణమాఫీ విషయంలో రాజీనామలపై పోటాపోటీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, రాజీనామాల డిమాండ్ల నేపథ్యంలో మూడు రోజుల కిందట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ దాడి చేసిన విషయం తెలిసిందే. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటాపోటీ సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ సంపూర్ణ రుణమాఫీ కోసం కార్యకర్తలతో సమావేశం నిర్వహించింది. అటు కాంగ్రెస్ నాయకులు రుణమాఫీ అభినందన ర్యాలీతో పాటు రాజీవ్‌గాంధీ జయంతి కార్యక్రమాలను మైనంపలి హన్మంతరావు నేతృత్వంలో ఏర్పాటు చేసుకున్నారు. రెండు సమావేశాలు ఒకే రోజు ఉండడంతో ఏం జరుగుతుందోనని పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.