యాదాద్రి భువనగిరి, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ కుట్ర మరోసారి బట్టబయలైంది. కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో ఎలాగైనా గెలిచి, మాజీ సీఎం ఆనవాళ్లు చెరిపేయాలని కంకణం కట్టుకున్నట్టు తేటతెల్లమైంది. గ్రామానికి ఏదో చేస్తామంటూ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యే వరుస పర్యటనలు, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామంటూ ప్రకటనలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం బెడిసి కొట్టింది. ఈ ఎన్నికలో కాంగ్రెస్, బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులకు సమాన ఓట్లు రావడంతో చివరకు ‘బ్యాలెట్ చోరీ’ కి దిగిందనే అపవాదు మూటగట్టుకుంది. ఎన్నికల్లో అవకతవకలపై బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి పలుగుల ఉమారాణి సోమవారం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
తురపల్లి మండలంలోని వాసాలమర్రిలో తొలి విడతలో భాగంగా 11న పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి పలుగుల ఉమారాణి(కత్తెర గుర్తు), కాంగ్రెస్ మద్దతుదారుగా దొమ్మాట అనురాధ(ఉంగరం గుర్తు) పోటీలో ఉన్నారు. మొత్తం 1,236 ఓట్లు పోలయ్యాయి. అందులో 3 ఓట్లు నోటాకు రాగా, 14 చెల్లని ఓట్లు ఉన్నట్టు గుర్తించారు. పోటీలో ఇద్దరు అభ్యర్థులకు 609 చొప్పున ఓట్లు వచ్చాయి. ఫలితం తేలకపోవడంతో టాస్ వేస్తామని ఎన్నికల అధికారులు ప్రకటించారు. దీనికి బీఆర్ఎస్ అభ్యర్థి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓట్ల లెకింపు సమయంలో రెండో వార్డుకు సంబంధించి 119 బ్యాలెట్ పేపర్లు వచ్చినట్టు అధికారులు చూపించారని, ఇప్పుడు 118 ఓట్లు మాత్రమే ఎలా ఉంటాయని ప్రశ్నించారు. అయితే ఆ ఒక ఓటు ఎకడికి పోయిందని అభ్యర్థి ఆబ్జెక్షన్ చెప్పినా అధికారులు వినిపించుకోలేదు. ఆఖరికి రాత్రి 11. 30గంటలకు టాస్ వేసి.. దొమ్మాట అనురాధ గెలిచినట్టు ప్రకటించారు.
మరుసటి రోజు కౌంటింగ్ జరిగిన రూమ్ కిటికీ వద్ద ఏ038321 అనే నంబర్ గల బ్యాలెట్ పేపర్ స్థానికులకు కనిపించింది. పేపర్ వెనుకాల పోలింగ్ అధికారి సంతకం తో పాటు 16/2 రౌండ్ సీల్ కూడా ఉంది. దానిపై కత్తెర గుర్తుపైనే ఓటు వేసినట్టు స్వస్తిక్ ముద్ర స్పష్టంగా కనిపిస్తున్నది. దీన్ని బట్టి బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిని ఉద్దేశపూర్వకంగానే ఓడించేందుకు కుట్ర చేశారని అర్థం అవుతున్నది. ఇదే విషయమై ఎంపీడీవో కార్యాలయం, స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా లాభం లేకుండా పోయింది.
యాదాద్రి భువనగిరి జిల్లా అధికారులు పట్టించుకోకపోవడంతో సోమవారం హైదరాబాద్లో రాష్ట్ర ఎన్నికల సంఘం సంయుక్త కార్యదర్శి వినోద్ కుమార్కు ఫిర్యాదు అందించారు. మిస్ అయిన ఓటు తనకు అనుకూలంగా ఉన్నందున తనను విజేతగా ప్రకటించాలని, లేని పక్షంలో రీ పోలింగ్ జరిపించాలని డిమాండ్ చేశారు. సమగ్ర విచారణ చేసి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. కేసీఆర్ దత్తత గ్రామంలో బీఆర్ఎస్ ప్రభావం లేదని నిరూపించేందుకు కాంగ్రెస్ నేతలు, అధికారులు కుమ్మక్కయ్యి సర్వ శక్తులు ఒడ్డారని ఆరోపించారు.