హైదరాబాద్, అక్టోబర్ 8(నమస్తే తెలంగాణ): ఉమ్మడి రాష్ర్టాన్ని దశాబ్దాలుగా పాలించిన కాంగ్రెస్, టీడీపీ హైదరాబాద్ నగరంలోని చెరువులను చెరబట్టాయి. ఈ రెండు పార్టీల ఏలుబడిలోనే మెజార్టీ చెరువులు అన్యాక్రాంతమయ్యాయి. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క చెప్పిన లెక్కలే చాటింపు వేస్తున్నాయి. డిప్యూటీ సీఎం చెప్పిన లెక్కల ప్రకారం.. హైదరాబాద్లో 920 చెరువులు, కుంటలు ఉన్నాయి. ఇందులో 225 చెరువులు ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్, టీడీపీ పాలనలోనే పూర్తిగా ఆక్రమణకు గురయ్యాయి. మరో 196 చెరువులను పాక్షికంగా ఆక్రమించారు. మిగిలిన 499 చెరువులు భద్రంగా ఉన్నట్టు భట్టి వివరించారు. అంటే ఈ లెక్కన మొత్తం చెరువుల్లో 421 చెరువులు కాంగ్రెస్, టీడీపీ హయాంలోనే ఆక్రమణకు గురైనట్టు ఆయనే తేల్చేశారు. మొత్తం చెరువుల్లో 45 శాతానికిపైగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందే ఆక్రమణలకు గురైనట్టు స్పష్టంచేశారు.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత పదేండ్లలో 20 చెరువులు పూర్తిగా ఆక్రమణకు గురయ్యాయని, ఉమ్మడి రాష్ట్రంలో పాక్షికంగా ఆక్రమణకు గురైన చెరువుల్లో మరో 24 చెరువులు పూర్తిగా ఆక్రమణకు గురయ్యాయని భట్టి విక్రమార్క వెల్లడించారు. ఉమ్మడి ఏపీలో మరో 127 చెరువుల ఆక్రమణలపర్వం ప్రారంభంకాగా గత పదేండ్లలో ఈ ఆక్రమణలు పెరిగినట్టు వెల్లడించారు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్, టీడీపీ పాలనలో 225 చెరువులు పూర్తిగా ఆక్రమణకు గురికాగా, తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనలో 20 చెరువులు మాత్రమే పూర్తిగా ఆక్రమణకు గురికావడం గమనార్హం. దీనిని బట్టి ఏ ప్రభుత్వాలు చెరువులను కాపాడాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డిప్యూటీ సీఎం వెల్లడించిన అంకెలు, లెక్కలే చెరువుల పరిరక్షణలో ఉమ్మడి ఏపీలో పాలించిన కాంగ్రెస్, టీడీపీ పార్టీలు ఏ మేరకు శ్రద్ధ పెట్టాయో, తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఏ మేరకు శ్రద్ధ పెట్టిందో స్పష్టం చేస్తున్నాయి.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క నాడు టీడీపీ, కాంగ్రెస్లో కీలక నేతలే. నాడు చెరువుల ఆక్రమణలపై సడి చప్పుడు చేయని నేతలు ఇప్పుడు పెడబొబ్బలు పెడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు లెక్కలు చెప్తున్న డిప్యూటీ సీఎం నాడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం చేశారని పర్యావరణవేత్తలు, ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అప్పుడు కండ్ల ముందు కబ్జా అవుతున్నా పట్టించుకోకుండా, ఇప్పుడు తాము తప్ప మరెవరూ చెరువులను బాగు చేయలేరనే విధంగా ఏమిటని చర్చించుకుంటున్నారు.