ఎంతగా అంటే.. ఈ రాష్ట్రంలోని ఏడు మండలాలను తీసుకెళ్లి ఆ రాష్ట్రంలో కలిపేంత! ఎంతగా అంటే.. విభజన చట్టంలో ఏపీ, తెలంగాణల్లో రెండు ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలని పార్లమెంటు తీర్మానిస్తే, ఏపీలో పోలవరానికి ఇచ్చి తెలంగాణకు మొండిచెయ్యి చూపేంత! ఎంతగా అంటే.. ఇక్కడ కట్టుకున్న ప్రాజెక్టును పడావు పెట్టి నీళ్లను పక్క రాష్ర్టానికి తరలించేంత! ఇంకెంతగా అంటే.. పోలవరం ప్రాజెక్టుకు ప్రమాదం జరిగినా విచారణే జరపకుండా రూ.1000 కోట్లతో రిపేర్లు చేసి, కాళేశ్వరంపై మాత్రం ఆగమేఘాలపై కేంద్ర సంస్థల్ని పంపి రాద్ధాంతం చేసేంత! రిపేర్లు చేయకుండా ఆదేశాలిచ్చేంత! ‘తల్లిని చంపి బిడ్డను బతికించినట్టు..’ కడుపునిండా విషంతో ఎగువ రాష్ర్టాన్ని ఎండబెట్టి, దిగువ రాష్ర్టానికి నీళ్లు పారిచ్చేంత! తల్లి గోదావరిని తరలించుకుపోయి.. సంబంధమే లేని కావేరికి కావళ్లు మోసేంత! అందుకోసం వేల కోట్ల నిధులు ధారపోసేంత!
కేసీఆర్ అనే ‘ఆ ఒక్కడు’.. అధికారంలో లేడని, ఇక్కడ అడిగే దిక్కులేదని, నోరులేని తెలంగాణను తడిగుడ్డతో గొంతుకోసే నయవంచక నాటకమిది. గోదావరిని రాష్ర్టాలు దాటించి తెలంగాణ రైతును మళ్లీ వలసలు, ఉరితాళ్ల బలవన్మరణాలపాలు చేసే పైశాచిక పర్వమిది!
పోలవరం జాతీయ ప్రాజెక్టు. కేంద్ర జల సంఘమే దానిని డిజైన్ చేసింది. నిర్మాణాన్ని కూడా పర్యవేక్షిస్తున్నది. అయినా ఆ డ్యామ్ భద్రతకు సంబంధించి అత్యంత కీలకమైన డయాఫ్రమ్ వాల్ నిర్మించిన ఏడాదిలోనే కొట్టుకుపోయింది. దీంతో డ్యామ్ పటిష్టత ప్రశ్నార్థకంగా మారింది. కానీ ఇప్పటివరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి విచారణ జరపలేదు. కేంద్ర సం స్థ కూడా దాని వైఫల్యాలను చర్చించలేదు. కేంద్రం కూడా ఒక్క మాటా మాట్లాడలేదు. ఇప్పుడు ఏకంగా అంతర్జాతీయ నిపుణులను రంగంలోకి దించి కొత్తగా దాదాపు రూ.1000 కోట్లకు పైగా ఖర్చుతో మరో డీ వాల్ నిర్మాణానికి పూనుకున్నారు.
కానీ, అదే కాళేశ్వరం ప్రాజెక్టుపై వ్యవహరిస్తున్న తీరు మాత్రం పూర్తిగా భిన్నం. లోపాలమయం అంటూ ముప్పేట దాడి కొనసాగిస్తున్నది. ఎన్డీఎస్ఏను ముందుపెట్టి ప్రాజెక్టు నిరుపయోగమనే ప్రచా రం సాగిస్తున్నది. కేంద్రానికి మద్దతు అన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం సైతం విచారణల పేరిట ప్రాజెక్టును పడా వు పెడుతున్నది. గోదావరిని చెరబట్టడమే కేంద్రం లక్ష్యం. గోదావరి జలాలు నిరాటంకంగా దిగువకు తరలిపోయే మార్గం సుగమం చేయడం, అందుకు అడ్డుగా నిలిచిన కాళేశ్వరం గొంతు నులమడమే అసలైన కుటిల పన్నాగం.
– మ్యాకం రవికుమార్
Kaleshwaram | హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): ఏపీ ప్రభుత్వం దాదాపు 194 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో పోలవరం ప్రాజెక్టు చేపట్టిన విషయం తెలిసిందే. గోదావరిపై దాదాపు 1.47 కి.మీ. పొడవుతో మట్టి, రాతి కట్టను (ఈసీఆర్ఎఫ్) నిర్మించాల్సి ఉంది. డ్యామ్ పటిష్టంగా ఉండాలన్నా, లీకేజీలు లే కుండా నీరు నిల్వ ఉండాలన్నా తొలుత డయాఫ్రం వాల్ (డీ వాల్) నిర్మించాల్సి ఉంటుంది. నీటి లీకేజీలను అరికట్టేందుకు, భారీ వరదల నుంచి డ్యామ్ పునాదిని పటిష్టంగా ఉంచడంలో ఇది అత్యంత కీలకం. డీ వాల్ నిర్మాణానికి వరద మళ్లింపు కోసం ఎగువ, దిగువన కాఫర్ డ్యామ్‌లను నిర్మించాల్సి ఉంటుంది. ఇక డీ వాల్‌ను నదిలోపల రాతిపొర నుంచి నదిపై భాగం బెడ్ లెవల్ వరకు నిర్మించాల్సి ఉంటుంది.
అది పూర్తయిన తర్వాతే ఈసీఆర్ఎఫ్ నిర్మించాలి. పోలవరం డ్యామ్ డీ వాల్ నిర్మాణం అప్పటి సీఎం చంద్రబాబు హయాంలో 2017లో చేపట్టారు. ఎగువన కాఫర్ డ్యామ్ నిర్మించకుండా దాదాపు రూ. 600 కోట్లతో 1.396 మీటర్ల పొడవు, 1.5 మీటర్ల వెడల్పు, నది అడుగుభాగంలోకి దాదా పు 90 మీటర్ల లోతుతో డీవాల్ నిర్మాణం చేపట్టారు. 2018 చివరినాటికే నిర్మాణం పూర్తి చేశారు. 2020 లో వచ్చిన గోదావరి భారీ వరదలకు వాల్ మొత్తం గా 3 చోట్ల దెబ్బతిన్నది.
ఒక చోట 200 మీటర్ల మేర కొట్టుకుపోయింది. అనేక చోట్ల డీవాల్ ఇసుక కోతకు గురై అగాథాలు ఏర్పడ్డాయి. ఎగువన కాఫర్ డ్యామ్ నిర్మించకపోవడమే ప్రమాదానికి ప్రధాన కారణం. డీ వాల్ దెబ్బతినడంతో దాదాపు రూ.500 కోట్ల నష్టం వాటిల్లింది. ఈసీఆర్ఎఫ్ పనులు పూర్తిగా నిలిచిపోయాయి. తద్వారా ప్రాజెక్టు నిర్మాణం రూ.35 వేల కోట్ల నుంచి 55 వేల కోట్లకు పెరిగింది. పోలవరం డ్యామ్ భద్రతే ప్రశ్నార్థకంగా మారింది.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్‌లో మొత్తంగా 8 బ్లాక్‌లు, 85 గేట్లు ఉన్నాయి. అందులో 7వ బ్లాక్‌లోని 20వ నంబర్ పిల్లర్ 2023 అక్టోబర్‌లో కుంగుబాటుకు గురైంది. అండర్ మైనిం గ్ జరగడమే అందుకు కారణమని తెలిసింది. అంటే పిల్లర్ వద్ద వేసిన సీకెంట్ ఫైల్స్‌లో రెండు చోట్ల ఏర్పడిన లోపం వల్ల దానిగుండా నీటి ప్రవాహం కొనసాగి పిల్లర్ కింది భాగంలో ఇసుక తొడేసింది. తద్వా రా పిల్లర్ అడుగు భాగంలో ఇసుక కదిలిపోవడంతో పిల్లర్ కుంగిపోయింది.
ఇదే విషయాన్ని ఇంజినీరింగ్ నిపుణులు సైతం నిర్ధారించారు. ఆ తరువాత పలు ఏజెన్సీలు నిర్వహించిన ఈఆర్టీ (ఎలక్ట్రోడ్ రెసిస్టివిటి టెస్ట్), గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ టెస్ట్ (జీపీఆర్)ల్లోనూ ఇదే విషయం వెల్లడైంది. మిగతా బ్లాక్‌లన్నీ సేఫ్‌గా ఉన్నాయని తేలింది. సూటిగా చెప్పాలంటే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి డీ వాల్, బరాజ్‌కు సంబంధించి సీకెంట్ ఫైల్స్ ఒకటే. నిర్మాణ విధానాలు వేరు తప్ప ఆ రెండు నిర్వర్తించే విధులు ఒక్కటే. కానీ విచిత్రమేమిటంటే, పోలవరం ఘటనపై నోరు మెదపకుండా, కొత్త డీవాల్ నిర్మాణానికి ఆమోదం తెలిపిన కేంద్ర ప్రభుత్వమే ఇక్కడ కాళేశ్వరంపై రాద్ధాంతం చేస్తుండడం.
కుంగిన పిల్లర్‌ను సాకుగా చూపి పూర్తిస్థాయిలో ఎలాంటి సాంకేతిక పరీక్షలు నిర్వహించకుండానే డిజైన్ లోపాలు, నిర్మాణ లోపాలు, ఓఅండ్ఎం నిర్వహణ లోపాలు అంటూ కాళేశ్వరం ప్రాజెక్టుపై కక్ష సాధింపునకు దిగడం విడ్డూరం. పునరుద్ధరణ ఊసెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం సైతం విచారణల పేరిట కేంద్ర సర్కారుకు వంతపాడుతున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాళేశ్వరం ప్రాజెక్టును పడావు పెడుతున్నాయి.
కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెప్తున్న నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్ఏ) ఇప్పటివరకు చేసిందేమీ లేదు. దేశవ్యాప్తంగా డ్యామ్‌ల భద్ర తా కార్యకలాపాలను పర్యవేక్షించడానికి 2021లోనే దీనిని ఏర్పాటు చేశారు. డ్యామ్ భద్రతా విధానాలను రూపొందించడానికి, ఆనకట్ట భద్రతకు సంబంధించి అవసరమైన నిబంధనలను ఎప్పటికప్పుడు సిఫార్సు చేయడానికి వివిధ విభాగాల్లో నిపుణులు, రాష్ర్టాల అధికారులతో కలిపి డ్యామ్ సేఫ్టీ జాతీయ కమిటీని (ఎన్సీడీఎస్) ఏర్పాటు చేసింది. కానీ ఇప్పటివరకు ఇది చేసిందేమీ లేదు.
ఎన్డీఎస్ఏ ఏర్పాటు చేసిన కమిటీల్లో డ్యామ్ నిర్మాణం, భద్రతకు సంబంధించి సర్వే ఇన్వేస్టిగేషన్, డిజైన్, జియాలజిస్ట్, హైడ్రాలజీ, హైడ్రో మెకానికాల్ ఇంజినీర్, ఎలక్ట్రికల్ ఇంజినీర్, మెటీరియల్ క్వాలిటీ కంట్రోల్ ఇంజినీర్లు, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీర్, డ్యామ్ బ్రేక్ అనాలసిస్, ఎమర్జెన్సీ యాక్షన్ ప్లాన్ ఇంజినీరింగ్, డ్యామ్ కన్స్ట్రక్షన్, రిహాబిలిటేషన్ విభాగాల్లో సేవలందించే నిపుణులను నియమించాలి. అన్ని క్యాడర్లలో కలిపి ఎన్డీఎస్ఏకు కేంద్రం 85 పోస్టులు మంజూరు చేసింది. కానీ ప్రస్తుతం ఎన్డీఎస్ఏలో ఉన్నది 25 మంది మాత్రమేనంటే దీని పనితీరు అర్థం చేసుకోవచ్చు.
ఎన్డీఎస్ఏ కమిటీనే ఇప్పటివరకు పూర్తిస్థాయిలో ఏర్పాటు కాలేదు. ఇదిలా ఉంటే ఎన్డీఎస్ఏ ఏర్పాటు తరువాత దేశవ్యాప్తంగా అనేక భారీ ప్రాజెక్టుల్లో ప్రమాదాలు వాటిల్లాయి. కానీ తమ దృష్టికి వచ్చింది మాత్రం కేవలం 5 సంఘటనలేనని ఎన్డీఎస్ఏ వెల్లడించింది. అందులో కాళేశ్వరం, ముల్ల పెరియార్, తీస్తా, లోయర్ సుబంసిరి, సర్దార్ సరోవర్, తుంగభద్ర వంటి వాటితో సహా డ్యామ్ సంబంధిత భద్రతా సమస్యలు తలెత్తాయి. కానీ ఎన్డీఎస్ఏ మాత్రం అందులో కేవలం రెండు ఘటనలపైనే నిపుణుల కమిటీలు ఏర్పాటు చేసింది.
హిమానీ నదాల ప్లాష్ ఫ్లడ్స్‌తో తీస్తా రివర్ ప్రాజెక్టులపై పడే ప్రభావాన్ని అంచనా వేయడానికి ఒక కమిటీని, కాళేశ్వరం ఘటనపై మరో కమిటీని ఏర్పాటు చేసింది. అందులో కాళేశ్వరం నివేదికను మాత్రమే 14 నెలల అనంతరం ఇచ్చింది. దీనిని సాకుగా చూపి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారానికి పూనుకోవడం రాజకీయమే తప్ప మరేమీ కాదని స్పష్టమవుతున్నది.
గోదావరిలో నీటిలభ్యత ప్రధానంగా ప్రాణహిత, ఇంద్రావతి నుంచే ఉంటాయని గణాంకాలే చెప్తున్నాయి. ఈ రెండు ఉపనదులు కలిసిన తర్వాత ప్రాజెక్టులు నిర్మిస్తే తెలంగాణ బీడు భూములను గోదావరి జలాలు పావనం చేసేవి. కానీ ఉమ్మడి రాష్ట్రంలో ఆరు దశాబ్దాల పాటు జరిగిన తతంగం అందుకు భిన్నం. ఎక్కడా ఏ చిన్న ఆటంకం లేకుండా, గోదావరి నీరు ఒక్క చుక్క కూడా తెలంగాణ గడ్డ మీద నిలబడకుండా ధవళేశ్వరం దాకా పరుగులు తీయాలనే కుతంత్రానే అమలు చేశారు. అందులో భాగంగానే ఉమ్మడి ఏపీ ఏర్పడేనాటికి గోదావరి జలాల వినియోగానికి సంకల్పించిన.. అప్పటికే మధ్యప్రదేశ్, మహారాష్ట్రతో ఒప్పందాలు పూర్తయి అంతరాష్ట్ర సమస్యలు కూడా పెద్దగా లేని తెలంగాణ చారిత్రక ప్రాజెక్టుల గొంతు సైతం నులిమారు. 350 టీఎంసీల వినియోగానికి రూపకల్పన చేసిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టును 126 టీఎంసీలకు కుదించి ఎందుకూ కొరగాకుండా చేశారు.
300 టీఎంసీల వినియోగానికి ప్రతిపాదించిన ఇచ్చంపల్లి ప్రాజెక్టుకు, దానికి అదనంగా 100 టీఎంసీలతో ప్రతిపాదించిన కంతనపల్లి ప్రాజెక్టులకు పాతరేశారు. చెరువులను కతం పట్టించారు. తెలంగాణ వాదుల అలుపెరుగని పోరాటాల నేపథ్యంలో కంటితుడుపుగా పలు ప్రాజెక్టులను చేపట్టారు. అవి కూడా ఎక్కడంటే నీటిలభ్యత లేనిచోట. అంటే పుష్కలంగా నీరున్న ప్రాణహిత, ఇంద్రావతి సబ్బేసిన్లను వదిలి నీరు అంతగా లభించని చోట ప్రాజెక్టులు కట్టారు. వెరసి పేరుకే ప్రాజెక్టులు తప్ప వాటితో తెలంగాణకు దక్కిన ఫలితం శూన్యం. కాగితాలపై ఆయకట్టును చూపుతూ ఉమ్మడి పాలకులు ఏండ్లుగా కనికట్టు చేస్తూ కట్టిపడేశారు. తెలంగాణ ఏర్పడేనాటికి గోదావరిపై ఉన్న ప్రాజెక్టులతో ఏటా నికరంగా 100 టీఎంసీల జలాలు వాడుకున్న దాఖలాలు లేవంటే ఉమ్మడి పాలకుల కుట్రను అర్థం చేసుకోవచ్చు. కానీ తెలంగాణ ఉద్యమ నేతగా కేసీఆర్ ఉమ్మడి పాలకుల నీటి కుట్రలను పసిగట్టి గర్జించారు.
కుటిల పన్నాగాలను తెలంగాణ జనానికి బట్టబయలు చేశారు. స్వరాష్ట్ర ఏర్పాటు తరువాత అత్యంత ప్రాధాన్యం కలిగిన ప్రాణహిత జలాలను ఒడిసిపట్టడమే ప్రధాన లక్ష్యంగా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారు. ఇంద్రావతి జలాల వినియోగానికి, అటు దేవాదుల ఆయకట్టుకు భరోసా కల్పించేందుకు సమ్మక్కసాగర్ బరాజ్‌ను నిర్మించారు. దాని దిగువన 60 టీఎంసీల సామర్థ్యంతో సీతమ్మ సాగర్ బరాజ్‌కు శ్రీకారం చుట్టారు. సూటిగా చెప్పాలంటే ప్రాణహిత, ఇంద్రావతి నదుల నీటిని ఒడిసిపట్టి, ఎగువన నీళ్లు లేని గోదావరి ప్రాజెక్టులకు తరలించి తెలంగాణను పంటలతో పచ్చగా మార్చే లక్ష్యంతో కేసీఆర్ ముందుకుసాగారు. సుదీర్ఘ మేధోమథనం సాగించి కాళేశ్వరం ప్రాజెక్టును రీడిజైన్ చేసి అత్యంత స్వల్పకాలంలో పూర్తిచేశారు.
ఉమ్మడి పాలకులు సృష్టించిన శతకోటి సమస్యలకు కాళేశ్వరం ద్వారా ఒకే ఒక పరిష్కారం చూపారు. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి రావడం వల్ల తెలంగాణలోని గోదావరి ముఖచిత్రం మారిపోయింది. ఈ ఒక్క ప్రాజెక్టు ద్వారానే గోదావరిలో మన 954 టీఎంసీల్లో 450 టీఎంసీలకు పైగా వినియోగించుకునేందుకు మార్గం సుగమమైంది. అందుకే ఆ ప్రాజెక్టుపై ఆది నుంచీ ఏపీ అనేక విధాలుగా కొర్రీలు పెడుతూ వచ్చినా ఫలించలేదు. కానీ మేడిగడ్డలో తలెత్తిన చిన్నపాటి సాంకేతిక లోపాన్ని సాకుగా చూపుతూ ప్రాణహిత జలాలను తెలంగాణకు దక్కకుండా చేసే కుట్రలకు ఏపీ మళ్లీ తెరలేపింది. అందుకు అనుగుణంగానే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు నిరర్ధకమంటూ ప్రాజెక్టుపై ముద్రవేసే కుటిల ప్రయత్నాలకు పూనుకున్నాయని అర్థమవుతున్నది.
పోలవరం డీ వాల్ దెబ్బతినడమంటే భారీ నష్టమే. కోట్ల రూపాయల నిధులు వృథా అయినా అక్కడి ప్రభుత్వం ఇప్పటికీ ఒక్క విచారణా చేపట్టలేదు. కేంద్రం కూడా విచారణ చేయించలేదు. కేంద్ర జలసంఘం నోరు మెదపలేదు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ నోరు విప్పలేదు. డీ వాల్ పునరుద్ధరణపై రాష్ట్ర ప్రభుత్వం అమెరికా, కెనడా తదితర అంతర్జాతీయ నిపుణులను తీసుకువచ్చి అధ్యయనం చేసింది. సలహాలు, సూచనలు స్వీకరించింది. మరోవైపు భారీ వరదలతోనే డీ వాల్ దెబ్బతిన్నదని పార్లమెంట్ వేదికగా కేం ద్రం వెల్లడించింది. వైఫల్యాలన్నీ కప్పిపెట్టి ఇప్పు డు కొత్తగా డీ వాల్ నిర్మాణానికి కేంద్ర జలసం ఘం ఆమోదం తెలిపింది. సీడబ్ల్యూసీ రూపొందించిన డిజైన్లకు డ్యామ్ డిజైన్స్ రివ్యూ ప్యానెల్ (డీడీఆర్పీ) సైతం ఆమోదం తెలిపింది. ఇప్పటికే నిర్మించిన డీ వాల్‌కు 6 మీటర్ల ఎగువన 1.47 కి.మీ. పొడవుతో కొత్తగా మరో డీవాల్ను రూ. 1000 కోట్లతో చేపట్టాలని నిర్ణయించింది. పనులు ప్రారంభం కాగా, ఏడాదిన్నరలోగా పూర్తి చేయాలని షెడ్యూలు ఖరారు చేసింది.
పోలవరం డీవాల్ దెబ్బతిన్న నేపథ్యంలో ప్రాజెక్టు నాణ్యతపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. పోలవరం ప్రాజెక్టు ఏపీకి ఏటీఎంలా మారిందని ప్రధాని మోదీ పలుమార్లు ఆరోపించారు. ప్రాజెక్టు నాణ్యతపై అనుమానాలున్నాయని, దీనిపై దృష్టిసారించారా? లేదా? ఉంటే అందుకు సంబంధించిన వివరాలివ్వాలని, డీ వాల్ పునరుద్ధరణ వివరాలు ఇవ్వాలని గతంలో ఎంపీ కనకమేడల రవీంద్రనాథ్ పార్లమెంట్లో కేంద్రాన్ని కోరారు. కానీ కేంద్రం సమాధానమివ్వలేదు. 2020లో వరదలతోనే డీ వాల్ దెబ్బతిన్నదని చేతులు దులుపుకున్నది. తిరిగి డీ వాల్ పునరుద్ధరణ చేపట్టనున్నట్టు కూడా గతంలో ప్రకటించింది. కానీ అవినీతి, నాణ్యతపై మాట్లాడలేదు.