హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : ‘బీసీలకు 42 రిజర్వేషన్ల అమలు కోసం బీఆర్ఎస్ తరఫున పార్లమెంట్లో ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టాం. బీసీలపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కాంగ్రెస్, బీజేపీలు మద్దతుగా కలిసిరావాలి’ అని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర డిమాండ్ చేశారు. బలహీనవర్గాల మేలు కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టంచేశారు. సోమవారం ఢిల్లీలో మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ రెండు పార్టీలు తలుచుకుంటే రెండు నిమిషాల్లో పార్లమెంట్లో బిల్లు పాసవుతుందని పేర్కొన్నారు. కానీ ఎన్నికల్లో లబ్ధికోసమే ఆ పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయని నిప్పులు చెరిగారు.
100 మంది ఎంపీలున్నా కాంగ్రెస్ తరఫున ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఏనాడూ బీసీల కోసం పార్లమెంట్లో కొట్లాడలేదని మండిపడ్డారు. ఓట్ చోరీ లాంటి అంశాన్ని లెవనెత్తి రోజుల తరబడి పార్లమెంట్‌ను స్తంభింపజేసిన ఆయన.. ఏ ఒక్కనాడు బీసీ కోటా గురించి ఎందుకు మాట్లాడలేదు? బీసీలంటే అంత చిన్నచూపెందుకు? అంటూ ప్రశ్నాస్ర్తాలను సంధించారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సైతం జంతర్‌మంతర్ ధర్నా, అసెంబ్లీలో తీర్మానం, ఆర్డినెన్స్‌ల పేరిట నాటకాలు చేయడం తప్పా బీసీ రిజర్వేషన్లపై చేసిందేమీ లేదని నిప్పులు చెరిగారు. మోదీని బడేభాయ్ అంటూ సంబోధించే ఈ ఛోటేభాయ్ ఏ ఒక్కరోజూ బీసీల కోటాపై ప్రధాని దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదని నిలదీశారు. బీసీ రిజర్వేషన్ల అంశాన్ని బీజేపీ పట్టించుకోవడమే లేదని విమర్శించారు. తాము ప్రవేశపెట్టిన బీసీ బిల్లుకు మద్దతుగా రాకుంటే.. ఆ రెండు పార్టీలూ బలహీనవర్గాల ఆగ్రహ జ్వాలల్లో మాడిమసైపోవడం ఖాయమని హెచ్చరించారు.
కేసీఆర్ పదేండ్ల పాలనలోనే బలహీనవర్గాలకు మేలు జరిగిందని వద్దిరాజు రవిచంద్ర ఉద్ఘాటించారు. మహిళా, బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని గతంలో తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించారని గుర్తుచేశారు. అనేకసార్లు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులను కలిసి వినతిపత్రాలు అందించారని చెప్పారు. కానీ నాడు బీఆర్ఎస్, కేసీఆర్‌పై అక్కసుతో కేంద్రం బీసీ బిల్లులను అణగదొక్కిందని విమర్శించారు. కేంద్రం, రాష్ట్రంలోని పాలకపక్షాలకు బుద్ధిచెప్పేందుకు సమయం కోసం బీసీలు ఎదురుచూస్తున్నారని స్పష్టంచేశారు.
హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): ప్రధానమంత్రి మోదీని 42 శా తం బీసీ రిజర్వేషన్ల అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు కలువలేదని బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ ప్రశ్నించారు. అనేకసార్లు ఢిల్లీకి వచ్చిన రేవంత్‌రెడ్డి.. ఆ అంశంపై ప్రధాని మోదీకి ఎందుకు విజ్ఞప్తి చేయలేదు? పార్లమెంట్లో లేవనెత్తాలని ప్రతిపక్ష నేత రాహుల్‌ను కోరలేదెందుకు?’ ప్రశ్నించారు. బీసీ కోటా అంశంపై కాంగ్రెస్ అడుగడుగునా దగా చేస్తున్నదని ధ్వజమెత్తారు. బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చేదాకా పంచాయతీ ఎన్నికలు పెట్టబోమని బీరాలు పలికిన సీఎం.. ఇప్పుడు ఎందుకు నిర్వహిస్తున్నారని నిలదీశారు. రేవంత్‌రెడ్డి బీసీలపై కపటప్రేమ నటిస్తున్నారని నిప్పులు చెరిగారు.
సోమవారం బీసీ సంక్షేమ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేశారు. ఇందులో ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ తదితర రాష్ట్రాల ఓబీసీ ప్రతినిధులు, వివిధ పార్టీల నేతలు హాజరయ్యారు. తెలంగాణ నుంచి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడారు. బీసీ బిల్లుల ఆమోదానికి కాంగ్రెస్ ఏనాడూ చిత్తశుద్ధి చూపలేదని ఆరోపించారు. రాష్ట్రపతి వద్దకు బిల్లులు పంపి చేతులు దులుపుకొన్నదని దుయ్యబట్టారు. బలహీనవర్గాలకు న్యాయం జరగపోతే తెలంగాణ ఉద్యమస్ఫూర్తితో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మరో పోరాటాన్ని నిర్మిస్తామని ప్రకటించారు.