హైదరాబాద్, అక్టోబర్27 (నమస్తే తెలంగాణ): 42% బీసీ రిజర్వేషన్ కోటా అంశంపై కాంగ్రెస్‌లో మరో నేత గళం విప్పారు. రాష్ర్టానికి చెందిన ఎంపీలందరం కలిసి రాజీనామా చేద్దామంటూ బీజేపీ నేతలకు సవాల్ విసిరారు. బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఆ తర్వాత అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపిన బీసీ బిల్లులు ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్నాయి. ఆ తర్వాత ఆర్డినెన్స్ పేరిట, ఇటీవల జీవో పేరిట కాంగ్రెస్ డ్రామాలకు తెరతీసింది. ప్రస్తుతం అదే పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్ యాదవ్ బీసీ కోటా అంశంపై గళం విప్పారు.
ఓ మీడియా సమావేశంలో బీసీ రిజర్వేషన్ల అంశంపై ఆయన స్పం దించారు. 8 మంది బీజేపీ లోక్‌సభ సభ్యులకు దమ్ము, ధైర్యం ఉంటే ముందుకు రావాలని, అందరం కలిసి రాజీనామా చే ద్దామని అనిల్‌కుమార్ యాదవ్ సవాల్ విసిరా రు. అప్పుడు కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో ఎందుకు చేర్చదో చూద్దామని, కేంద్రంపై ఉమ్మడిగా ఒత్తిడి తీసుకొద్దామని పిలుపునిచ్చారు. అనిల్‌కుమార్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. రాజీనామా చేయాలని లోక్‌సభ సభ్యులకు పిలుపునివ్వడం కాకుండా, అదే దమ్ము, ధైర్యముంటే బీసీ బిల్లు కోసం ముందుగా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలంటూ అనిల్‌కుమార్‌కు ప్రతిసవాల్ విసురుతున్నారు.