జనగామ, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ) : ఎలాంటి అవినీతి జరగని ఫార్ములా ఈ-కార్ రేస్‌లో విచారణకు ఏసీబీ అనుమతి ఇస్తూ గవర్నర్ ఆమోదం తెలుపడంతో బీఆర్ఎస్పై కాంగ్రెస్, బీజేపీ కలిసి కుట్రలు చేస్తున్నాయనేది తేటతెల్లమైందని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై రాజకీయ కక్ష సాధింపు చర్యలను ఖండిస్తున్నట్టు గురువారం ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ను కట్టడి చేసేందుకు, రాజకీయ క్షేత్రంలో కేటీఆర్‌ను ఎదుర్కొనేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, బీజేపీ కలిసి పనిచేస్తున్నాయని విమర్శించారు. హామీలు అమలు చేయలేక ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతున్నా, ఎన్నికల ముందు ఇలాంటి కేసుల అంశాన్ని తెరపైకి తెచ్చి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ధ్వజమెత్తారు.
రెండేండ్లుగా ఫార్ములా ఈ-రేస్‌పై విచారణ పేరుతో ప్రభుత్వం కొండను తవ్వి ఎలుకను పట్టలేకపోయిందని ఎద్దేవా చేశారు. మళ్లీ స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో కాంగ్రె స్ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు కక్షపూరిత రాజకీయాలకు ప్రభుత్వం పూనుకున్నదని మండిపడ్డారు. విచారణ పేరిట కేటీఆర్‌ను ఇబ్బంది పెట్టాలని రేవంత్‌రెడ్డి చూస్తున్నారని చెప్పారు. ఫార్ములా ఈ -కార్ రేస్‌తో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ని పెంచి తెలంగాణ రాష్ర్టాన్ని కేటీఆర్ ప్రపంచ వ్యాప్తం చేశారని గుర్తుచేశారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా హమీలు అమలయ్యే వరకు కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటామని స్పష్టంచేశారు. కాంగ్రెస్ కుట్రలను కోర్టుల్లో ఎదురొంటామని స్పష్టం చేశారు.