హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): కుటుంబ రాజకీయాలకు కేరాఫ్‌గా మారిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు.. సీఎం కేసీఆర్‌ది కుటుంబ పాలనంటూ విమర్శలు చేయడం గురివింద సామెతను గుర్తు చేస్తున్నదంటూ రాష్ట్ర పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీలోని కేంద్ర మంత్రులు, సీఎంలు, మంత్రులు, జాతీయ నేతలు, రాష్ట్ర నేతల వరకు వారి వంశవృక్షాలు కనిపిస్తాయని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
మోతీలాల్ నెహ్రూ కొడుకు జవహర్లాల్ నెహ్రూ, నెహ్రూ కూతురు ఇందిరా గాంధీ, ఇందిరా కొడుకు రాజీవ్‌గాంధీ, రాజీవ్ గాంధీ కూతురు ప్రియాంక గాంధీ అంటూ దామోదర్ దుయ్యబట్టారు. ఇది కుటుంబ పాలన కాదా? అని ఆయన ప్రశ్నించారు.
కేంద్రమంత్రులు అనురాగ్ ఠాకూర్, పీయూష్ గోయల్, జ్యోతిరాదిత్య సింధియా, కిరణ్ రిజిజు, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవీస్, బీజేపీ ఎంపీలు రాజ్వీర్సింగ్, వరుణ్ గాంధీ, దుశ్యంత్‌సింగ్, ప్రీతమ్ ముండే ఇలా అనేక మంది వారసత్వ రాజకీయాల నుంచి వచ్చిన సంగతిని బీజేపీ నాయకులు మరచి.. కేసీఆర్‌ను విమర్శించడం వారి రాజకీయ అజ్ఞానానికి నిదర్శనమని చెప్పారు. విపక్షాలు ఎంత దుష్ప్రచారం చేసినా, బీఆర్ఎస్ గెలుపును అడ్డుకోలేరని, కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం ఖాయమని కోలేటి స్పష్టం చేశారు.