సూర్యాపేట, జనవరి 31 (నమస్తే తెలంగాణ): మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్ నోటీసులనేది రేవంత్‌రెడ్డి రాక్షసానందానికి పరాకాష్ట అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. సూర్యాపేటలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఫోన్‌ట్యాపింగ్ అంటూ మరోసారి సినిమాను సెకండ్ రిలీజ్ చేసి డైవర్షన్ పాలిటిక్స్‌కు కాంగ్రెస్ తెరలేపిందని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో అసలు కేసే లేదని, తమకు నష్టం జరిగిందని ఎవ్వరూ ఫిర్యాదు చేయలేదని తెలిపారు. కేసీఆర్‌ను ఎదుర్కోలేక కాంగ్రెస్, బీజేపీలు ఇలాంటి దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతున్నాయని దుయ్యబట్టారు.
మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ నోటీసులు ఇచ్చినట్టు అందరికీ తెలుసని పేర్కొన్నారు. 65 ఏండ్లు దాటిన వారు ఎక్కడ కోరితే అక్కడే విచారించాలని చట్టం స్పష్టంగా చెప్తున్నప్పటికీ అధికారులు ఇలా వ్యవహరించడం సిగ్గుచేటని మండిపడ్డారు. కొన్ని రోజులుగా ప్రభుత్వ ప్రతిష్ఠ దిగజారుగుతున్న నేపథ్యంలో డైవర్షన్ రాజకీయాలకు తెరదీశారని విమర్శించారు. సమావేశంలో మాజీ ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్, మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి రామచంద్రనాయక్, సీనియర్ నాయకుడు, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ, ఉప్పల ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.