MLC Kavitha | తెలంగాణ ఉద్యమంలో పెద్దపల్లి జిల్లా కీలకంగా పనిచేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఉద్యమ సమయంలో సింగరేణి సమ్మె చేస్తే ఢిల్లీకి ఉద్యమ సెగ తగిలిందని గుర్తుచేశారు. పెద్దపల్లి జిల్లాలో గురువారం పర్యటించిన ఎమ్మెల్సీ కవిత.. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 160 నుంచి 170 పార్టీ వచ్చి పోయాయని.. కానీ 25 ఏండ్లుగా నిలబడ్డ ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల గుండె చప్పుడైందని తెలిపారు. ప్రతి ఒక్కరితోనూ బీఆర్ఎస్ పార్టీ పెనవేసుకుందని.. తెలంగాణ ప్రజలతో పార్టీది పేగుబంధమని వ్యాఖ్యానించారు. ఒకప్పుడు అవహేళన చేసిన వారికి కూడా గులాబీ జెండా రక్షణగా ఉందని అన్నారు. పదేళ్లలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే నంబర్‌వన్‌గా నిలిపామని గుర్తుచేశారు.
గులాబీ జెండా 25 ఏండ్ల చరిత్రను యావత్ తెలంగాణ గుర్తుచేసుకుంటుందని కల్వకుంట్ల కవిత అన్నారు. ఏడాది పాటు బీఆర్ఎస్ పార్టీ వేడుకలు చేస్తామని తెలిపారు. ప్రతి ఏటా ప్లీనరీలు జరుపుకుంటున్నా.. ఈ రజతోత్సవ సభ ప్రత్యేకమైందని తెలిపారు. గత 25 ఏళ్లుగా ఉద్యమ, బీఆర్ఎస్ పాలనా కాలాన్ని ప్రజలంతా నెమరేసుకునేలా ఈ సభ ఉండబోతుందని చెప్పారు. ఈ రజతోత్సవ సభకు పెద్దపల్లి జిల్లా నుంచి పెద్దఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ అంటే ప్రేమ ఉన్న ప్రతిఒక్కరూ వరంగల్ సభకు రావాలన్నారు. చరిత్రలో నిలిచిపోయేలా, తెలంగాణ కుంభమేళాగా సభ జరగనుందని చెప్పారు.
పెద్దపల్లి కాంగ్రెస్ నాయకులు వ్యవహరిస్తున్న తీరును ప్రజలు గమనించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు ఎగ్గొట్టి రైతులకు భరోసా లేకుండా చేసిందని మండిపడ్డారు. వ్యవసాయం చేయాలంటే రైతులు భయపడే స్థితికి తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అకాల వర్షాలకు వడ్లు తడిసి, మామిడికాయలు రాలి రైతులు నష్టపోతుంటే ఈ జిల్లా మంత్రి శ్రీధర్‌బాబు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో అకాల వర్షాలకు రైతులు నష్టపోతే క్షేత్రస్థాయిలో పరిశీలించి నష్టపరిహారం అందజేశామని గుర్తుచేశారు. మరి కాంగ్రెస్ పార్టీ రైతులను ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు.
గ్రూప్-1లో అవకతవకలు జరిగాయని.. ఆ పరీక్షను రద్దు చేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. కేసీఆర్ జీవో 55 తెస్తే.. కాంగ్రెస్ జీవో 29 తీసుకొచ్చి యువకుల పొట్టకొడుతున్నారని మండిపడ్డారు. స్థానికత కోసమే తెలంగాణ పోరాటం జరిగితే.. కాంగ్రెస్ మళ్లీ నాన్ లోకల్ తీసుకొస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఇచ్చిన 80 వేల ఉద్యోగాల నోటిఫికేషన్ల నుంచి 50 వేల ఉద్యోగాలిచ్చి తామేదో కొత్తగా చేసినట్లుగా కాంగ్రెస్ నాయకులు చెప్పుకుంటున్నారని విమర్శించారు. గురుకులాలను నాశనం చేసి విద్యార్థులను పొట్టనపెట్టుకున్నారని మండిపడ్డారు. జిల్లాకో పెట్రోల్ బంక్‌తో వచ్చే లాభమేమీ లేదని వ్యాఖ్యానించారు.
సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటివరకు జై తెలంగాణ అనలేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఉద్యమ కాలం నుంచి తెలంగాణ వచ్చాక కూడా జై తెలంగాణ అనని ముఖ్యమంత్రి ఉండటం, మంత్రివర్గం ఉండటం మన దురదృష్టమని వ్యాఖ్యానించారు. జై సోనియమ్మ అనుడే తప్ప జై తెలంగాణ వాళ్ల నోటిలోనుంచి రాదని విమర్శించారు. ఆ మాట రానంతసేపు వాళ్లు తెలంగాణ గురించి ఆలోచించరని అన్నారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో సింగరేణిని ప్రైవేటుపరం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. లాభాల వాటాలో సగం డబ్బులు ఇచ్చి కార్మికులను మోసం చేసిందని గుర్తుచేశారు. కాంగ్రెస్, బీజేపీలకు చెరో 8 మంది ఎంపీలు ఉన్నప్పటికీ రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదని విమర్శించారు. వాళ్లను చూస్తుంటే ఇంటిపనికైనా, ఒంటిపనికైనా మనోడు ఒక్కడు ఉండాలని అనిపిస్తుందని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ రెండూ ఒక్కటేనని ఆమె వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్దే విజయమని ధీమా వ్యక్తం చేశారు.