ఖైరతాబాద్, డిసెంబర్ 31 : బీసీలకు 42% రిజర్వేషన్లు సాధ్యం కాకపోవడానికి ప్రధాన దోషులు కాంగ్రెస్, బీజేపీలేనని వక్తలు విమర్శించారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రౌండ్‌టేబుల్ సమావేశంలో శాసనమండలిలో ప్రతిపక్ష నేత, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి మాట్లాడుతూ.. బీసీలు రిజర్వేషన్ల కోసం పోరాటాలు చేస్తుంటే, ప్రభుత్వం మాత్రం తాత్సారం చేస్తున్నదని దుయ్యబట్టారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నదని, రిజర్వేషన్ల ప్రక్రి య పూర్తయ్యే వరకూ ఆగుతుందనే గ్యారెంటీలేదని పేర్కొన్నారు. 78 ఏండ్లలో దేశాన్ని పా లించిన పార్టీలు.. బీసీలకు మరణశాసనం రాశాయని, బీసీల అభివృద్ధిని ఎన్నడూ ఆకాంక్షించలేదని మండిపడ్డారు. బీసీ సంఘాలన్నీ ప్ర జాక్షేత్రంలోకి వెళ్తే సత్ఫలితాలు వస్తాయని చె ప్పారు. నేటికీ కొందరు నేతలు పార్టీల భ్రమ ల్లో ఉన్నారని, దానిని మోయడం వల్లే బీసీలు కోటా సాధించలేకపోతున్నారని పేర్కొన్నారు.
కాంగ్రెస్, బీజేపీ తలుచుకుంటే రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం లభిస్తుందని, కానీ, ఆ రెండు పార్టీల మోసం వల్లే అది సాధ్యం కావడం లేదని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం 12.5 లక్షల మంది విద్యార్థుల పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉన్నదని, 12వేల కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్‌లో ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. బీసీ రిజర్వేషన్లు పెంచకుండా ప్రభుత్వం జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు. ఫిబ్రవరి నుంచి రథయాత్రలు, ఏప్రిల్‌లో హైదరాబాద్‌లో భారీ బహిరంగసభ నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మాజీ ఎంపీ వీ హన్మంతరావు, బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, కో చైర్మన్ కుల్కచర్ల శ్రీనివాస్, వైస్ చైర్మన్ దీటి మల్లయ్య, బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేశ్‌చారి, బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్‌గౌడ్, యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు కనకాల శ్యామ్ కురుమ, మహిళా అధ్యక్షురాలు మణిమంజరి, బీసీ సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ, శ్రీధర్, రామకృష్ణ, భరత్‌గౌడ్ పాల్గొన్నారు.