కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా ఉండే మానవతా రాయ్కి టికెట్ ఎందుకు రాలేదు?
‘ముందొచ్చిన చెవుల కన్నా.. వెనుకొచ్చిన కొమ్ములు వాడి’ అన్న సామెత గుర్తుకొస్తుంది. పార్టీ కోసం ప్రాణం పెట్టి పనిచేసిన నన్ను పక్కన పెట్టి పారాచూట్ నేతలకు టికెట్ ఇచ్చారు. సత్తుపల్లి నాదే అనుకున్నా. చివరికి మరొకరికి ఇచ్చారు. ఆమె స్థానికురాలు కూడా కాదు.
బయట ప్రచారం జరుగుతున్నట్టే మీ విషయంలోనూ టికెట్ల అమ్మకాల ప్రభావం ఉందంటారా?
ముమ్మాటికీ అంతే! కాంగ్రెస్లో జేబు చూస్తరు, కడుపు చూడరు. నా జేబులో డబ్బులు లేవు. నా గుండెలో కాంగ్రెస్ మీద ఉన్న ప్రేమ వాళ్లకు కనిపించలే! డబ్బు కట్టలు ఇచ్చినోళ్లకే టికెట్ ఇచ్చారు. పార్టీ కోసం పని చేసేవాళ్లు కాంగ్రెస్కు అవసరం లేదు. పార్టీ కోసం కష్టపడ్డవాళ్ల నోట్లో మన్నుకొట్టిన ఈ పార్టీ.. ప్రజల గురించి ఆలోచిస్తుందని నేననుకోను. అధికారంలోకి వస్తే.. ఏం దోచుకోవాలి, ఎన్ని కోట్లు వెనుకేసుకోవాలి అని ఇప్పుడే ప్లాన్ చేసుకుంటున్నారు.
2014, 2018లో కూడా మీకు టికెట్ మిస్ అయ్యింది కదా?
అప్పుడు విద్యార్థులుగా ఉన్న మమ్మల్ని పక్కన పెడితే.. నేరుగా రాహుల్ గాంధీని కలిశాం. విద్యార్థి నేతలకు రెండు టికెట్లు ఇవ్వాలని చెప్పారు ఆయన. అదీ అమలు కాలేదు. బీసీ నేతలకు, విద్యార్థి నాయకులకు టికెట్ ఇవ్వాలన్న ఆలోచనే కాంగ్రెస్లో లేదు. నాలాంటి చాలామంది నాయకులకు అన్యాయం జరిగింది. కురువ విజయ్ కుమార్, బెల్లయ్య నాయక్, బల్మూరి వెంకట్ ఇలా చాలామంది ఉన్నారు. కనీసం అధిష్ఠానమో, రాష్ట్ర నాయకత్వమో ఒక ఫోన్ చేసి కూడా మాట్లాడలేదు. మా ఆత్మగౌరవం మీద దెబ్బకొట్టారు. మాలాంటి వాళ్లకు అన్యాయం చేసిన కాంగ్రెస్ పాపం ఊరికే పోదు.
నామినేటెడ్ పదవులు, టికెట్ల కేటాయింపులో బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి నాయకులకు తగిన గుర్తింపు ఇచ్చింది కదా!
ఉన్నమాట చెప్పుకోవాలి. కేసీఆర్ గారు ముందు కడుపు చూస్తారు. కడుపు నింపే గుణం ఆయనది. ఉద్యమ సమయంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నేతలను పిలిచి అన్నం పెట్టేవాడు. ‘డబ్బులున్నాయా, లేదా’ అని ఆలోచించకుండా విద్యార్థి నాయకులకు సీట్లిచ్చి ప్రోత్సహించి అసెంబ్లీకి పంపారాయన. దటీజ్ లీడర్ క్వాలిటీ.
ఇప్పటి వరకు మెడలో కాంగ్రెస్ కండువా లేకుండా మానవతారాయ్ మీడియాలో కనిపించడు. తొలిసారి ఇలా.. (ప్రశ్న పూర్తి కాకముందే..)
మెడలో కాంగ్రెస్ కండువా లేని మానవతా రాయ్ మొదటిసారి కనిపిస్తున్నాడు. నెలలో నాలుగైదు కండువాలు కొనేంత అభిమానం ఆ పార్టీ మీద ఉండేది. నా ఆత్మ గౌరవాన్ని చంపేసిన తర్వాత.. పార్టీ మీద ప్రేమ కూడా చచ్చిపోయింది.
ఇన్నాళ్లూ కాంగ్రెస్లో ఉన్న మీరు బీఆర్ఎస్ పార్టీలో చేరడాన్ని ఎలా సమర్థించుకుంటారు?
బీఆర్ఎస్ పిలుపు అందుకొని ఆ పార్టీలో చేరాను. నిజంగా చెప్పాలంటే ప్రస్తుతం ఎమ్మెల్యే టికెట్ గానీ, ఏదైనా పదవి గానీ ఇచ్చే పరిస్థితులు, అవకాశాలు లేవు. అయితే.. నా ఆత్మగౌరవానికి విలువ ఇచ్చి పిలిచారు. అందుకే బీఆర్ఎస్లో చేరాను!
చివరిగా ప్రజలు, విద్యార్థులు, యువతకు మీరేం చెప్పదలుచుకున్నారు?
అందరికీ ఒకటే చెప్తున్నా.. దయచేసి చెప్పుడు మాటలో, రెచ్చగొట్టే మాటలో నమ్మి మోసపోకండి. జేబులు చూసి విలువ ఇచ్చే పార్టీలను నమ్మకండి. కడుపు నింపే నాయకుడు, పార్టీని గెలిపించండి. నాలుగు మెతుకులు కడుపులోకి వస్తాయి. పిల్లల భవిష్యత్ బాగుంటుంది.