ఆదిలాబాద్/ఖమ్మం, మే 13 నమస్తే తెలంగాణ : ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం ఆళ్లపాడులో స్వతంత్ర ఏజెంట్‌గా ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తపై కాంగ్రెస్ ఏజెంట్ దాడి చేశాడు. బాధిత ఏజెంట్ కథనం ప్రకారం.. బీఆర్ఎస్ కార్యకర్త మరీదు వెంకయ్య ఆళ్లపాడు 133వ బూత్‌లో స్వతంత్ర ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో కాంగ్రెస్ ఏజెంట్ నరసింగుల సతీశ్ అదే గ్రామానికి చెందిన ఓ మహిళా ఓటరుతో వెళ్లి ఈవీఎం బటన్ నొక్కాడు. దీనిపై బీఆర్ఎస్ ఏజెంట్లు నల్లబోయిన కృష్ణారావు, మరీదు వెంకయ్య అభ్యంతరం తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్త బండి గోపి పలువురు ఓటర్లను పదేపదే పోలింగ్ కేంద్రంలోకి తీసుకొచ్చి కాంగ్రెస్‌కు ఓట్లు వేయించే ప్రయత్నం చేశాడు. దీనిపై బీఆర్ఎస్ చెందిన ఏజెంట్లు పోలింగ్ ఆఫీసర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో మరీదు వెంకయ్య ముఖంపై కాంగ్రెస్ ఏజెంట్ నరసింగుల సతీశ్ పిడిగిద్దులు గుద్దాడు. అక్కడున్న ఏజెంట్లు, ఓటర్లు, సముదాయించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని 27వ పోలింగ్ కేంద్రం వద్ద బీజేపీ కార్యకర్తలు, కాంగ్రెస్ మహిళలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకొన్నది. బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్, కొందరు బీజేపీ నేతలు పోలింగ్ స్టేషన్ వద్ద వివాదానికి దారి తీసింది. బీజేపీ నేతలను ఇక్కడి నుంచి పంపించి వేయాలంటూ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాస్‌రెడ్డి భార్య మౌనారెడ్డి మరికొందరు మహిళలు అధికారులను కోరారు. దీంతో బీజేపీ కార్యకర్తలు, కాంగ్రెస్ మహిళలకు తీవ్ర వాగ్వాదం జరిగింది.