బెజ్జంకి/తిమ్మాపూర్, అక్టోబర్ 17: సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గుండారంలో మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ (Rasamayi Balakishan) వ్యవసాయ క్షేత్రంలోని ఇంటిపై కాంగ్రెస్ నాయకులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. శుక్రవారం రసమయి వ్యవసాయ క్షేత్రానికి కాంగ్రెస్ నాయకులు భారీగా తరలిరావడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మధ్య ఇటీవల మాటల యుద్ధం నడుస్తున్నది. ఈ నేపథ్యంలో రసమయి వ్యవసాయ క్షేత్రం ముట్టడికి కాంగ్రెస్ నాయకులు పిలుపునిచ్చా రు. మానకొండూర్ నియోజకవర్గం నుంచి వచ్చిన కాంగ్రెస్ నాయకులు రసమయి వ్యవసాయ క్షేత్రంలోని ఇంటిపై రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో కిటికీ అద్దాలు పగిలిపోయి, ఇంట్లోకి రాళ్లు దూసుకెళ్లాయి. దాడికి పాల్పడిన కాంగ్రెస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు.
సానుభూతి కోసం వెంపర్లాడకు: రసమయి
ఎమ్మెల్యే కవ్వంపల్లి సానుభూతి కోసం వెంపర్లాడుతున్నారని రసమయి బాలకిషన్ విమర్శించారు. తాను మాట్లాడినప్పుడు ఎవ రో రికార్డ్ చేసిన ఆడియో సేకరించి, సానుభూ తి వచ్చేలా కట్ చేసుకుని, విడుదల చేశారని.. పూర్తి ఆడియో తన దగ్గర ఉన్నదని చెప్పారు. ఎమ్మెల్యేను తిట్టారనే ఆరోపణలతో తనపై కేసు నమోదైన నేపథ్యంలో అమెరికాలో ఉన్న రసమయి వీడియో విడుదల చేశారు. కవ్వంపల్లి క్యాంప్ కార్యాలయంలో నెల కింద విలేకరులతో మాట్లాడినప్పుడు తీవ్రమైన పదాలతో తనను దూషించారని గుర్తుచేశారు. అందుకే తాను కూడా వాయిస్ మెసేజ్ ద్వారానే హెచ్చరించినట్టు చెప్పారు. తాను అమెరికాలో ఉన్న సమయంలో కేసు పెట్టారని ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీసులు తనపై కేసు నమోదు చేస్తే… కవ్వంపల్లిపై కూడా నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తాను మాట్లాడిన ఆడియోతోపాటు, కవ్వంపల్లి వ్యాఖ్యల పూర్తి ఆడియో రికార్డును రసమయి బాలకిషన్ విడుదల చేశారు. ఎవరిది తప్పో ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు.