హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ ఇంతకాలం మోసం చేస్తూ వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. 42 శాతం రిజర్వేషన్లపై గురువారం హైకోర్టు స్టే ఇవ్వడంపై ఆయన స్పందించారు. కాంగ్రెస్ మోసపూరిత విధానాల వల్లే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు దక్కకుండా పోయాయని ఆవేదన వ్యక్తంచేశారు. కామారెడ్డి డిక్లరేషన్‌ను కాలరాసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బీసీలను దారుణంగా మోసం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
వారిని మభ్యపెట్టేందుకు తీసుకొచ్చిన ఈ జీవో న్యాయస్థానంలో నిలబడదని బీఆర్ఎస్ చెప్పిన మాట ఇప్పుడు నిజమైందని పేర్కొన్నారు. కులగణన నుంచి జీవో విడుదల వరకు బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ అడుగడుగునా మోసం చేసిందని, ఇది దగా, నయవంచన తప్ప మరోటి కాదని ధ్వజమెత్తారు. కులగణన మొదలు ప్రతి సందర్భంలోనూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాన్ని, అనుసరిస్తున్న తప్పుడు విధానాలపై బీఆర్ఎస్ ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి అనేక సూచనలు చేసినట్టు గుర్తుచేశారు.
అసెంబ్లీలో పాసైన బిల్లులను ఆమోదింప చేసుకునేందుకు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాల్సింది పోయి, ఏకపక్షంగా వెళ్లి ధర్నా పేరిట నాటకమాడారని మండిపడ్డారు. రిజర్వేషన్లు సాధించాకే ఎన్నికలకు వెళ్తామని, బీసీలకు 42 శాతం పదవులు కట్టబెడతామని చెప్పి, ఆ తర్వాత పూటకొక మాట మార్చిందని దుమ్మెత్తిపోశారు. రేవంత్‌రెడ్డి ఢిల్లీలో మాట్లాడుతూ రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిని చేసిన తర్వాతే రిజర్వేషన్లు సాధిస్తామని చెప్పి అడ్డగోలుగా అన్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
రాష్ట్రపతి వద్ద బిల్లు పెండింగ్‌లో ఉండగానే ఆర్డినెన్స్ పేరుతో ప్రభుత్వం కొంతకాలంపాటు హంగా మా చేసిందని కేటీఆర్ మండిపడ్డారు. చివరికి న్యాయస్థానంలో నిలబడని జీవోతో బీసీలను మభ్యపెట్టారని దుయ్యబట్టారు. బీసీలకు చట్టబద్ధంగా 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న హామీని తుంగలో తొక్కి పార్టీపరంగా ఇస్తామని చెప్పిన రోజే కాంగ్రెస్ మోసం బయటపడిందని కేటీఆర్ పేర్కొన్నారు.
22 నెలల చేతకాని పాలనపై ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పెల్లుబుకుతున్న ప్రజాగ్రహాన్ని, వ్యతిరేకతను చూసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వణికిపోతున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చలేక, మరోవైపు, అసమర్థ పాలనతో ఉన్న సంక్షేమ పథకాలను నిలిపివేసి తీవ్రమైన వ్యతిరేకతను మూటగట్టుకున్నారని తెలిపారు. ఈ కారణంగానే స్థానిక ఎన్నికలను వివాదంగా మార్చి, ఏదో రకంగా వాయిదా వేయించేందుకు రిజర్వేషన్ల అంశాన్ని పావులా వాడుకున్నారని దుయ్యబట్టారు.
కాంగ్రెస్‌తోపాటు కేంద్రంలోని బీజేపీ కూడా బీసీ బిల్లులను పెండింగ్‌లో పెట్టి వెనుకబడిన వర్గాలను దారుణంగా మోసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసాలను, రేవంత్‌రెడ్డి దుర్మార్గాన్ని చూసి బలహీనవర్గాల ప్రజలు అసహ్యించుకుంటున్నారని చెప్పారు. స్థానిక ఎన్నికలు నిర్వహించకపోవడంతో పల్లెల్లో పాలన పడకేసిందని, ప్రజలు అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. పనికిరాని జీవోతో రాష్ట్రంలోని బీసీలను, గారడీ మాటల గ్యారెంటీ కార్డుతో నాలుగు కోట్ల రాష్ట్ర ప్రజలను వంచించిన కాంగ్రెస్ పార్టీకి ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని హెచ్చరించారు.