CM Revanth Reddy | హైదరాబాద్, నవంబర్ 14(నమస్తే తెలంగాణ): కరకు మాటలు, అనుచిత చేతలతో తరచుగా వివాదాస్పదం అవుతున్న సీఎం రేవంత్రెడ్డి మరోసారి తన తీరును బయటపెట్టుకున్నారు. ప్రైవేటు టీచర్లకు చదువు, అనుభవం లేవని అన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులకున్న అనుభవం, విద్య ప్రైవేటు పాఠశాలల్లో ఉన్నటువంటి టీచర్లకు లేవని తెలిపారు. గురువారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన బాలల దినోత్సవానికి రేవంత్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉపాధ్యాయులను ఉద్దేశించి రేవంత్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 26,854 ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో 26 లక్షల మంది విద్యార్థులు చదువుతుంటే 11వేలకు పైగా ఉన్న ప్రైవేటు పాఠశాలల్లో 36 లక్షలకు పైగా విద్యార్థులు చదువుతున్నారు.
మీకున్న అనుభవం, విద్య ప్రైవేటు టీచర్లకు లేవు. కానీ పేద తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని ప్రైవేటు పాఠశాలలకు పంపించడమే ప్రతిష్ఠగా భావిస్తున్నారు. దీనిపై ప్రభుత్వ ఉపాధ్యాయులు ఆలోచించాల్సి అవసరం ఉంది. ప్రభుత్వ పాఠశాలల ప్రతిష్ఠ దెబ్బతింటున్నది. ప్రభుత్వ పాఠశాల్లో అన్ని మౌలిక వసతులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది అన్నారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేయాలని మీరంతా తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చారు. తెలంగాణ సమాజం వ్యసనాల వైపు వేగంగా పరిగెడుతున్నది.
ఒకప్పుడు సమస్యలపై పోరాడిన యూనివర్సిటీలు ఇప్పుడు గంజాయికి బానిసలయ్యాయి. అధికారులు ఇంటింటి సర్వే కోసం వస్తున్నారు, వారికి అన్ని వివరాలను అందించాలి. రిజర్వేషన్లు 50శాతం దాటాలన్నా, ఉపాధి దక్కాలన్నా కులగణన అవసరం. కులగణనలో ఎవరి ఆస్తులను ఎవరూ గుంజురోకరని, పథకాలు తొలగించబోరని తెలిపారు. సంక్షేమ పథకాలు, రిజర్వేషన్ల పెంచేందుకే కులగణన చేస్తున్నట్టు తెలిపారు. సర్వేపై కొందరు కుట్రలు చేస్తున్నారని, ఆ కుట్రల్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉంది. ఈ ప్రభుత్వానికి మీరంతా అండగా ఉండాలని, ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని తల్లిదండ్రులకు చెప్పాలి అని కోరారు. 21 సంవత్సరాలు నిండితే ఎమ్మెల్యేగా పోటీ చేసేలా వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేయాలని శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి శ్రీధర్రాబును రేవంత్రెడ్డి కోరడంతో అంతా విస్మయం వ్యక్తంచేశారు.