మంచిర్యాల, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): గ్రేడ్-2 ఫార్మాసిస్ట్ నియామకాలపై సందిగ్ధం నెలకొన్నది. పరీక్ష నిర్వహించి ఈ నెలాఖరుతో ఏడాది కావస్తున్నా వెయిటేజ్ మార్కుల విషయం ఎటూతేలకపోవడం ఆశావహులకు నిరాశ కలిగిస్తున్నది. 733 గ్రేడ్-2 ఫార్మాసిస్ట్ పోస్టుల భర్తీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంహెచ్ఎస్ఆర్బీ(మెడికల్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు) ద్వారా గతేడాది సెప్టెంబర్ 24న నోటిఫికేషన్ ఇచ్చింది. దాదాపు 25వేల మందికి నవంబర్ 30న పరీక్ష నిర్వహించి డిసెంబర్ 3న వెబ్ నోటీస్ ద్వారా ప్రిలిమినరీ కీ విడుదల చేసింది. మే 12న పైనల్ కీ, సీబీటీ రిజల్ట్ కూడా ఇచ్చింది. ఇప్పటివరకు ప్రొవిజనల్ లిస్టు విడుదల చేయలేదు. ఈ పోస్టుల భర్తీ ప్రక్రియలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఫార్మాసిస్టులకు ప్రభుత్వం కల్పిస్తున్న వెయిటేజ్ పొందేందుకు కొందరు అనర్హులని, చట్టప్రకారం వారికి సర్వీస్ మార్కులు ఇవ్వకూడదని, అలాగే నోటిఫికేషన్ ప్రక్రియలోనూ లోపాలున్నాయంటూ డిసెంబర్లో కొందరు అభ్యర్థులు కోర్టుకు వెళ్లారు. వారి వాదనలు విన్న హైకోర్టు ఈ ఏడాది మార్చిలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అభ్యర్థుల అభ్యంతరాలు చట్టబద్ధమైనవా పరిశీలించాలని పేర్కొన్నది. ఫలితాలు ఇచ్చి పోస్టింగ్‌లు ఇచ్చాక అభ్యంతరాలు నిజమని తేలితే మాత్రం ఆమేరకు రిజల్ట్ మార్చాల్సి వస్తుంది. దీంతో ఏడాదిగా తేల్చలేకపోవడంతో అభ్యర్థులు విసుగెత్తిపోతున్నారు.
ఏమిటీ లోపాలు?
ఇప్పటికే కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఫార్మాసిస్టులుగా పనిచేస్తున్న వారికి 20శాతం మార్కులను వెయిటేజీ కింద ఇస్తున్నారు. 100 మార్కులకైతే 20 మార్కులు ఇవ్వాలి. వెయిటేజీకి సంబంధించి 20 మార్కులను మినహాయించి కేవలం 80 మార్కులకే పరీక్ష నిర్వహించారు. దీంతో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్‌లో పనిచేయని వారు నష్టపోవాల్సి వస్తున్నది. రాత పరీక్షకు కనీస అర్హత మార్కులు ఎన్నో నిర్ణయించకుండా, వెయిటేజీ ఎలా నిర్ణయిస్తారన్నది కొందరి వాదన. అంతేగాక కొందరు ప్రభుత్వంలో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్‌లో పనిచేస్తూనే ప్రైవేట్ మెడికల్ షాపుల్లో వాళ్ల సర్టిఫికెట్లను అద్దెకు ఇచ్చారు. దరఖాస్తు చేసుకున్న 1600మందిలో కొందరు రెండు చోట్ల పనిచేస్తున్నారని ఆర్టీఐ సమాచారాన్ని అభ్యర్థులు కోర్టుకు అందజేసినట్టు తెలిసింది.
చట్టవిరుద్ధంగా వ్యవహరించి పనిచేస్తూ, ప్రైవేట్‌లో సర్టిఫికెట్ అద్దెకు ఇచ్చిన వారికి వెయిటేజ్ మార్కులు ఇవ్వకూ డదన్నది వారి డిమాండ్. దరఖాస్తు సమయంలోనే సర్టిఫికెట్ వెనుక కూడా అప్లోడ్ చేసి ఉంటే వారు పనిచేసే వివరాలు కూడా వచ్చేవని చెబుతున్నారు. చట్టాలు, గతంలో కోర్టు తీర్పులను అనుసరించి ఈ వ్యవహారంలో ముందుకు వెళ్లలేక ఫలితాలను పెండింగ్ పెట్టినట్టు తెలుస్తున్నది. ఇప్పటికే అభ్యర్థుల అభ్యంతరాల ఆధారంగా కాంట్రా క్ట్, ఔట్సోర్సింగ్ ఫార్మాసిస్టుల సర్టిఫికెట్లను ప్రభుత్వం వెరిఫై చేసినట్టు తెలిసింది. వెయిటేజీ మార్కుల కోసం 900మంది సర్టిఫికెట్లను అద్దెకు ఇచ్చారని గుర్తించినట్టు సమాచారం. ప్రస్తుతం ఆ ఫైల్ వైద్యారోగ్యశాఖ మంత్రికి చేరిందని వెంటనే నిర్ణయం తీసుకొని తుది ఫలితాలు విడుదల చేసి నియామకాలు చేయాలని వారు కోరుతున్నారు.