హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తేతెలంగాణ ) : ఎన్నికల సిబ్బంది శిక్షణపై గందరగోళం నెలకొన్నది. ఎన్నికల కమిషన్ నిర్దేశించిన షెడ్యూల్ మేరకు రిటర్నింగ్ (ఆర్వో), అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ల (ఏఆర్వోల)కు గురువారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో శిక్షణ ఇవ్వాల్సి ఉన్నది. శనివారంలోగా పోలింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్లకు ట్రైనింగ్ పూర్తిచేయాలి. అయితే పంచాయతీ ఎన్నికలు ఇప్పట్లో లేవనే సంకేతాలు అందడంతో కొన్ని జిల్లాల్లో శిక్షణను వాయిదా వే యగా, మరికొన్ని జిల్లాల్లో యథావిధిగా నిర్వహించారు. ఎన్నికల సంఘం, పంచాయతీ రాజ్‌శాఖ అధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు లేకపోవడంతోనే ఈ అయోమయం నెలకొన్నది. ఫిబ్రవరి నెలలోనే పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమైనట్టు వార్తలు రావడం, మంత్రులు సైతం పలుమార్లు ప్రకటించడంతో త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుందని అంతా భావించారు. ఎన్నికల సంఘం సైతం ఈ దిశగా అన్నిచర్యలు చేపట్టింది. అన్ని జిల్లాలకు బ్యాలెట్ బాక్సులను చేరవేసింది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన 3 వారాల్లోగా ఎన్నికల ప్రక్రియను పూర్తిచేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లను నియమించారు. వార్డులవారీగా పోలింగ్స్టేషన్లను సైతం గుర్తించారు. ఎన్నికలకు ఇప్పట్లో వెళ్లే ఉద్దేశం లేదనే సంకేతాలను సీఎం, మంత్రులు ఇచ్చారు. ఈ నెల 16 నుంచి 28 వరకు తిరిగి కులగణన సర్వే చేపడతామని, మార్చిలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి కులగణనకు చట్టబద్ధత కల్పించి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించాలని కేంద్రానికి సిఫారసు చేయనున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు.
పంచాయతీ ఎన్నికల నిర్వహణకు చకచకా ఏర్పాట్లుచేసిన ఎన్నికల కమిషన్ ప్రభుత్వ నిర్ణయంతో అయోమయంలో పడింది. గురువారం ఆర్వోలు, ఏఆర్వోలకు శిక్షణ విషయంలోనూ స్పష్టత లేకుండాపోయింది. దీంతో ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం తదితర జిల్లాల్లో నిర్దేశించిన షెడ్యూల్ మేరకు శిక్షణ ఇచ్చారు. మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి, మెదక్ తదితర జిల్లాల్లో వాయిదా వేసినట్టు తెలిసింది. అలాగే ఈ నెల 15న పోలింగ్స్టేషన్ల జాబితా ప్రకటిస్తారా? అనే దానిపై సందిగ్ధత నెలకొన్నది.