కంఠేశ్వర్, ఏప్రిల్ 21: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వం సోమవారం నిర్వహించిన రైతు మహోత్సవం ప్రారంభ వేడుకల్లో గందరగోళం చోటుచేసుకున్నది. మంత్రులు ప్రయాణించిన హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో పెనుప్రమాదం తప్పింది. కార్యక్రమ ఏర్పాట్లలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. వేడుకల ప్రారంభోత్సవానికి రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో నిజామాబాద్‌కు వచ్చారు. స్థానిక గిరిరాజ్ కేంద్రంలో హెలికాప్టర్ కిందకు దిగుతున్న సమయంలో కళాశాల మైదానంలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున దుమ్ము లేచింది. దీంతో రైతు మహాసభ వేడుకల కోసం ఏర్పాటు చేసిన స్వాగత తోరణం కూలిపోయింది. మహోత్సవ వేడుకల్లో ఏర్పాటు చేసిన కొన్ని స్టాళ్లు సైతం ధ్వంసమయ్యాయి. అక్కడ ఏం జరుగుతున్నదో అర్థంకాక ప్రజలు, రైతులు పరుగులు తీశారు. ఈ క్రమంలో పలువురికి గాయాలైనట్టు సమాచారం. ముగ్గురు మంత్రు లు వస్తున్నా, ఏర్పాట్లు చేయడంలో అధికారులు విఫలమయ్యారని, ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే ఎవరు భాద్యత వహిస్తారని అక్కడకు వచ్చిన పలువురు ఆగ్రహం వ్యక్తంచేశారు.
పైలట్‌కు డీజీసీఏ నోటీసులు ; నిజామాబాద్ ఘటనపై విచారణకు ఉన్నతాధికారుల ఆదేశం
హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): నిజామాబాద్ జిల్లా కేంద్రంలో హెలికాప్టర్ ల్యాండింగ్ ఘటనపై పైలట్‌కు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కార్యాలయం నోటీసు జారీచేసింది. హెలికాప్టర్‌ను నిర్దిష్ట ప్రాంతంలో కాకుండా మరో చోట పైలట్ ల్యాండ్ చేసినట్టు డీజీసీఏ అభిప్రాయపడింది. నిజామాబాద్‌లో సోమవారం జరిగిన రైతు మహోత్సవ సభకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్, షబ్బీర్ అలీ వచ్చారు. ఈ హెలికాప్టర్ హెలిప్యాడ్ ఏర్పాటు చేసిన ప్రదేశంలో కాకుండా సభా ప్రాంగణం పకనే ల్యాండ్ అయ్యింది. దీంతో ఒక్కసారిగా హెలికాప్టర్ రెక్కల నుంచి వచ్చిన గాలితో టెంట్లు, స్వాగత తోరణం కూలిపోయాయి. దీంతో సభా ప్రాంగణం నుంచి రైతులు పరుగులు పెట్టారు. ఫలితంగా స్వల్ప తొకిసలాట జరిగింది. ఈ ఘటనపై సీరియస్ అయిన డీజీసీఏ పైలట్‌కు నోటీసులు జారీచేసింది. రాష్ట్ర ఉన్నతాధికారులు ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని స్థానిక జిల్లా కలెక్టర్, పోలీసు కమిషనర్లను ఆదేశించింది.