హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): అక్రమ కట్టడాల బిల్డర్స్ ఆస్తులు జప్తు చేసి బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డికి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ విజ్ఞప్తి చేశారు. హైడ్రా పనితీరుపై సీఎం రేవంత్‌రెడ్డికి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పలు సూచనలు, సలహాలు చేశారు. పేదవారి ఇళ్లు కూల్చినప్పుడు వారికి ప్రభుత్వం భూమి ఇవ్వాలని లేదా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని కోరింది. బిల్డర్లతో కుమ్మక్కై ఇష్టారీతిన రిజిస్ట్రేషన్లు, లే అవుట్ పర్మిషన్లు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని సూచించారు. చెరువుల నుంచి కూల్చిన కట్టడాల వ్యర్థాలను తీసి, చుట్టూ కంచె వేసి, కాలనీవాసులకు చెరువును అప్పగించాలని కోరారు. హైడ్రా వంటి సంస్థలు జిల్లాల్లోనూ కావాలని ప్రజలు కోరుతున్నారని, రాష్ట్రమంతటికీ వర్తించేలా ఒక చట్టం చేసి ప్రభుత్వ భూములు కాపాడటానికి సంస్థను ఏర్పాటు చేయాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ విజ్ఞప్తి చేశారు.
కోట్ల విలువైన భూపందేరంపై పిల్
హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ గచ్చిబౌలిలో పర్యాటక శాఖ రూ.కోట్ల విలువైన 3 ఎకరాల భూమిని సప్తర్షి హోటల్‌కు కట్టబెట్టడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంలో హైకోర్టు మంగళవారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. సమగ్ర వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావు ధర్మాసనం ఆదేశించింది. గచ్చిబౌలిలో సర్వే నంబర్ 91లో ఉన్న ఈ భూమిని 2010లో సప్తర్షి హోటల్‌కు అప్పగించిన వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని బక జడ్సన్ వేసిన పిటిషన్‌పై విచారణను 4వారాలకు వాయిదా వేసింది.
వాస్తవాలను దాచి పిల్ వేయడంపై హైకోర్టు ఆగ్రహం ; కేసును సివిల్ కోర్టులోనే తేల్చుకోవాలని స్పష్టీకరణ
హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ సంజీవరెడ్డినగర్‌లోని బీకేగూడలో 102/3, 102/2 సర్వే నంబర్లలో ఉన్న 1,537 చదరపు గజాల క్రీడా మైదానా న్ని పరిక్షించడంలో అధికారులు విఫలమయ్యారంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు డిస్మిస్ చేసింది. ఆ క్రీడా మైదానాన్ని పరిరక్షించేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ గతంలో ఓ పిటిషన్‌ను వేసి వాపసు తీసుకున్న వాస్తవాన్ని గుట్టుగా ఉంచడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ వివాదాన్ని సివిల్ కోర్టులోనే తేల్చుకోవాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావు ధర్మాసనం స్పష్టం చేసింది.