మంచిర్యాల, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ ప్రాజెక్టులను తానెప్పుడూ అడ్డుకోలేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నవన్నీ పచ్చి అబద్ధాలని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ ప్రాజెక్టులను అడుగడుగునా అడ్డుకున్నది చంద్రబాబేనని స్పష్టంచేశారు. ఇప్పుడు కూడా బనకచర్ల ప్రాజెక్టు కట్టి వరద జలాలతోపాటు.. వాటిపై తెలంగాణకు ఉన్న హక్కును సైతం తరలించుకొనిపోయే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు రద్దు కోసం శుక్రవారం బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యార్థి సదస్సులో ఆయన మాట్లాడారు. మన నీళ్ల కోసం, నీళ్లపై హక్కుల కోసం తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో మరో జల సాధన ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో రెండు లక్షల ఎకరాలకు సాగునీరిచ్చేందుకు కేసీఆర్.. బీఆర్ అంబేద్కర్ పేరుతో వార్ధా ప్రాజెక్ట్‌కు రూపకల్పన చేస్తే చంద్రబాబు లేఖరాసి దాన్ని అడ్డుకున్నారని విమర్శించారు. కాళేశ్వరం మూడో టీఎంసీ ఇవ్వొద్దని, కాళేశ్వరం అనుమతులు రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి బాబు లేఖ రాసినట్టు చెప్పారు. కాళేశ్వరంతోపాటు సీతారామ, సమ్మక్క ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కేంద్రానికి లేఖలు రాసింది చంద్రబాబు కాక ఇంకెవరో చెప్పాలని డిమాండ్ చేశారు.
యావత్ తెలంగాణ ఎదురుతిరగాలి
బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. బనకచర్లపై కమిటీ పేరుతో టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నేతలు ఒక్కటై తెలంగాణకు శాశ్వతంగా అన్యాయం చేయబోతున్నారని విమర్శించారు. అందుకని ఈ కమిటీని వ్యతిరేకించడతోపాటు, రాష్ట్రమంతా అగ్నిగోళం కావాల్సిన అవసరం ఉన్నదని సూచించారు. తెలంగాణ ప్రజలంతా ఉద్యమ స్ఫూర్తితో మళ్లీ వీధుల్లోకి వచ్చి.. ‘మా నీళ్లు మాకే.. మా హక్కులు మాకు కావాలి’ అని కొట్లాడాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న చారిత్రక ద్రోహానికి యావత్ తెలంగాణ సమాజం ఎదురుతిరగాలని పిలుపునిచ్చారు. సదస్సులో బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్కసుమన్, మంచిర్యాల, బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యేలు దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య, రాష్ట్ర నాయకులు విజిత్‌రావు, రాజారమేశ్, బీఆర్ఎస్వీ నాయకులు పాల్గొన్నారు.
పాలమూరు ఎత్తిపోతలను అడ్డుకున్నది బాబే: వీ ప్రకాశ్
రేవంత్‌రెడ్డి సొంత, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాల్లో పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకున్నది, ట్రిబ్యునల్‌కు వెళ్లి స్టే తెచ్చింది చంద్రబాబు నాయుడేనని తెలంగాణ నీటిపారుదల నిపుణుడు వీ ప్రకాశ్ విమర్శించారు. ఇప్పటికీ ఆ ప్రాజెక్టుకు ఆటంకాలు కలిగిస్తున్నది కూడా ఆయనేనని స్పష్టం చేశారు. తెలంగాణకు అన్యాయం చేసే బనకచర్ల ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో ముందుకు సాగనివ్వబోమని హెచ్చరించారు. గోదావరిలో తెలంగాణ వాటా 968 టీఎంసీలు ఉంటే ఇప్పటికీ 450 టీఎంసీలే వాడుకుంటున్నామని తెలిపారు. మిగిలిన నీటిని ఆంధ్రాకు తరలించుకుపోయే కుట్రలో భాగమే బనకచర్ల అని పేర్కొన్నారు. బనకచర్ల కడితే తెలంగాణ ఎడారిగా మారుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. రేవంత్, చంద్రబాబు కుట్ర చేసి తెలంగాణను ఎడారిగా మార్చాలని చూస్తున్నారని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి తెలంగాణ నీటిని ఆంధ్రాకు దోచిపెడుతున్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు.