Minister KTR | హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావుకు మరో ప్రతిష్ఠాత్మక సమావేశానికి ఆహ్వానం అందింది. వ్యవసాయరంగంలో ప్రపంచ ప్రగతి చర్చకు వేదికగా పరిగణించే ‘బోర్లాగ్ ఇంటర్నేషనల్ డైలాగ్’ సదస్సులో పాల్గొని తెలంగాణ వ్యవసాయ ప్రగతి ప్రస్థానాన్ని వివరించాలని సదస్సు నిర్వాహకులు మంత్రి కేటీఆర్‌ను ఆహ్వానించారు. అక్టోబర్ 24 నుంచి 26 వరకు అమెరికాలోని ఐయోవా రాష్ట్రంలో ఉన్న డెస్మోయిన్‌లో ఈ సదస్సు జరుగనున్నది. దీనికి ప్రపంచం నలుమూలల నుంచి 1200 మంది వ్యవసాయ రంగ నిపుణులు, శాస్త్రవేత్తలు హాజరుకానున్నారు. వర్చువల్‌గా మరికొంతమంది పాల్గొంటారు. ఈ సమావేశానికి వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డికి కూడా ఆహ్వానం అందింది. ప్రపంచ హరిత విప్లవ పితామహుడు నార్మన్ ఈ బోర్లాగ్ పేరిట ఏర్పాటుచేసిన బోర్లాగ్ ఇంటర్నేషనల్ డైలాగ్ సమావేశంలో ఈసారి ఆహార నాణ్యత, పరిమాణాన్ని పెంచడంతోపాటు అందరికీ ఆహార లభ్యత అనే అంశాలపై చర్చించనున్నారు. ‘మీ ప్రసంగం బోర్లాగ్ డైలాగ్ సదస్సుకు సాటిలేని విలువను జోడిస్తుంది. ప్రపంచ ఆహార అభద్రతను తగ్గించడం, ఆహార వ్యవస్థను మెరుగుపర్చడం కోసం కృషిచేస్తున్నవారు హాజరయ్యే ఈ సదస్సులో మీరు పాల్గొనడం సదస్సుకు మరింత గౌరవం తెస్తుంది’ అని వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ టెర్రీ ఈ బ్రాన్‌స్టాడ్ మంత్రి కేటీఆర్‌కు పంపిన ఆహ్వానంలో పేర్కొన్నారు. వ్యవసాయాభివృద్ధిపై తెలంగాణ రాష్ట్ర అనుభవాలను ఈ సమావేశంలో చర్చించడం వల్ల ఈ సమావేశాలకు హాజరవుతున్న అనేకమందికి ఎంతో ఉపయోగంగా ఉంటుందని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రగతిని ముఖ్యంగా వ్యవసాయ రంగ ప్రగతిని గుర్తించి ఈ అంశంపై ప్రసంగించాల్సిందిగా వరల్డ్ ఫుడ్ ప్రైస్ ఫౌండేషన్ పంపిన ఆహ్వానం పట్ల మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తంచేశారు. సీఎం 2వ పేజీలోకేసీఆర్ ఆధ్వర్యంలో గత పది సంవత్సరాల్లో వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం ఎన్నో వినూత్న, విప్లవాత్మక కార్యక్రమాలను అమలుచేశామని తెలిపారు. వాటి ఫలాలను ఈ రోజు తెలంగాణ రైతాంగం అందుకొంటున్నదని చెప్పారు. ఆహార భద్రతలో దేశానికి తెలంగాణ రాష్ట్రం భరోసాగా నిలుస్తున్నదని పేర్కొన్నారు. ఇంతటి విజయవంతమైన తెలంగాణ వ్యవసాయ నమూనాను అంతర్జాతీయ వేదికపై వివరించాలని వచ్చిన ఆహ్వానం తెలంగాణ రాష్ట్ర విధానాలకు దకిన గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు.
01
ప్రపంచ వ్యవసాయ రంగానికి బోర్లాగ్ ఇంటర్నేషనల్ డైలాగ్ సదస్సును దిక్సూచిగా భావిస్తారు. అమెరికాలోని ఐయోవా రాష్ట్రంలో ఏటా ఈ సదస్సును వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ సంస్థ నిర్వహిస్తుంది. ఈ సమావేశాల్లో వ్యవసాయ నిపుణులతోపాటు విధాన నిర్ణేతలు, పలు రంగాల శాస్త్రవేత్తలు, ఔత్సాహికులు కూడా పాల్గొంటారు. ఈ ఏడాది హార్నెసింగ్ ఛేంజ్ థీమ్‌తో సదస్సును నిర్వహిస్తున్నట్టు బ్రాన్స్టాండ్ తన లేఖలో తెలిపారు. నార్మన్ ఈ బోర్లాగ్ ఇంటర్నేషనల్ డైలాగ్‌ను బోర్లాగ్ డైలాగ్ అని కూడా పిలుస్తారు. 65 కంటే ఎక్కువ దేశాల నుంచి గ్లోబల్ లీడర్లు, నిపుణులు, అధ్యాపకులు ఇందులో పాల్గొని స్థిరమైన, సమానమైన, పోషకాహార వ్యవస్థను సాధించడానికి అవసరమైన మార్గాలపై చర్చిస్తారు.