హైదరాబాద్, జనవరి 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ప్రక్రియకు మరో కీలక ముందడుగు పడింది. 117 మున్సిపాలిటీలు, ఆరు మున్సిపల్ కార్పొరేషన్ల వార్డుల్లోని పోలింగ్స్టేషన్వారీగా సిద్ధంచేసిన ముసాయిదా ఓటర్ల జాబితాను (డ్రాఫ్ట్ ఓటరు లిస్టు) రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) గురువారం అధికారికంగా విడుదల చేసింది. రాజ్యాంగ నిబంధనలు, తెలంగాణ మున్సిపాలిటీల చట్టం-2019 ప్రకారం ఈ ఓటర్ల జాబితాను రూపొందించినట్టు ఎస్ఈసీ కార్యదర్శి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఓటర్ల సౌకర్యార్థం ఈ ముసాయిదా జాబితాలను అన్ని వార్డు, మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టరేట్ కార్యాలయాల వద్ద నోటీసు బోర్డుల్లో ప్రదర్శించినట్టు పేర్కొన్నారు. ఎస్ఈసీ అధికారిక వెబ్సైట్ (టీ-పోల్)లో కూడా డ్రాఫ్ట్ ఓటరు జాబితా అందుబాటులో ఉన్నదని, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలోని ఓటర్లందరూ ఈ ముసాయిదా జాబితాలో తమ పేర్లు ఉన్నాయో లేవో వెంటనే సరిచూసుకోవాలని సూచించారు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 5వ తేదీలోగా ఫిర్యాదుల చేయొచ్చని పేర్కొన్నారు.