హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డికి బినామీ సంస్థగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కేఎల్ఎస్ఆర్ సంస్థ తనను వేధిస్తున్నదని ఆరోపిస్తూ హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త, బెంగాల్ కోల్డ్ రోలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ సౌరభ్ అగర్వాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ)లో కేఎల్ఎస్ఆర్పై న్యాయ పోరాటం చేస్తున్నందుకు తనను, తన కుటుంబాన్ని వేధిస్తున్నారని తెలిపారు. కేఎల్ఎస్ఆర్ అక్రమాలకు సంబంధించిన ఓ కేసును చెన్నైలోని నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) విచారణ జరుపుతున్నదని తెలిపారు. ఆ కేసు విచారణ నుంచి ట్రిబ్యునల్ సభ్యుడొకరు తప్పుకొన్నారని పేర్కొన్నారు. తాను వ్యక్తిగత కారణాల వల్ల విచారణ నుంచి తప్పుకోలేదని, న్యాయవ్యవస్థకు సంబంధించిన ఒక గౌరవనీయ వ్యక్తి ఒత్తిడి చేయడం వల్లనే తప్పుకొన్నానని ఆ సభ్యుడు స్వయంగా ప్రకటించాడని గుర్తుచేశారు. కేఎల్ఎస్ఆర్ నుంచి సస్పెండ్ అయిన డైరెక్టర్లకు అనుకూలంగా ఉత్తర్వులు ఇవ్వాలని ఒక ఉన్నత న్యాయస్థానానికి చెందిన న్యాయమూర్తి తనను సంప్రదించారని ఆ సభ్యుడు వెల్లడించారని, దీనికి సంబంధించిన కాల్ లాగ్స్, మెసేజ్‌లను మొబైల్లో సదరు సభ్యుడు చూపించారని అగర్వాల్ తన పిటిషన్లో పేరొన్నారు. ఈ ఆరోపణలపై సీబీఐ, ఈడీ దర్యాప్తునకు ఆదేశించాలని సుప్రీంకోర్టును కోరారు.
సుప్రీంకోర్టులో ఏం జరిగిందంటే..
సుప్రీంకోర్టులో అగర్వాల్ వేసిన పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తి జస్టిస్ జాయ్‌మాలా బాగ్చి ధర్మాసనం శుక్రవారం విచారించింది. పిటిషనర్ అగర్వాల్ తరఫున న్యాయవాది అశ్వినికుమార్ ఉపాధ్యాయ వాదనలు వినిపించారు. కేఎల్ఎస్ఆర్ సంస్థపై ఆయన పలు కీలక ఆరోపణలు చేశారు. కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్ సంస్థపై చెన్నైలోని ఎన్సీఎల్ఏటీ వద్ద పోరాడుతున్న కేసును ఉపసంహరించుకోవాలని అగర్వాల్‌పై తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నారని ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. అగర్వాల్‌ను పోలీసులు వేధిస్తున్నారని, అతడి 75 ఏండ్ల తల్లిని అక్రమంగా అరెస్టు చేశారని వివరించారు. కొందరికి అనుకూలంగా తీర్పు ఇవ్వాలని ఒక ఉన్నత న్యాయస్థానానికి చెందిన సీనియర్ సభ్యుడు తనను సంప్రదించారని చెన్నై ఎన్సీఎల్ఏటీ సభ్యుడు ఆరోపించినట్టు తెలిపారు.
ప్రస్తుతం ఈ వ్యవహారం ఢిల్లీ ప్రధాన ఎన్సీఎల్ఏటీ బెంచ్‌కు బదిలీ అయ్యిందని, రోజువారీ విచారణ కొనసాగుతున్నదని తెలిపారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు.. ఈ దశలో తాము ఏ వ్యాఖ్యలు చేసినా.. లేదా ఆదేశాలిచ్చినా వాటి ప్రభావం పెండింగ్‌లో ఉన్న ఎన్సీఎల్ఏటీలోని కేసు విచారణపై ఉంటుందని అభిప్రాయపడింది. నిర్ణీత కాలవ్యవధిలో పరిషరించాలని ఇప్పటికే ట్రిబ్యునల్‌ను ఆదేశించినట్టు చెప్పింది. ఎన్సీఎల్ఏటీ ఉత్తర్వులు వెలువడగానే వాటిని తమకు నివేదించాలని పిటిషనర్‌ను ఆదేశించింది. ఈ దశలో అగర్వాల్ తరఫు న్యాయవాది కల్పించుకుని, కేంద్ర, రాష్ట్ర అధికారులను కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించాలని తన క్లయింట్‌పై బలవంతపు చర్యలు తీసుకోకుండా తెలంగాణ రాష్ట్ర సరార్కు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఎన్సీఎల్ఏటీలో వచ్చే నిర్ణయం ఆధారంగా ప్రస్తుత పిటిషన్ మీద తదుపరి చర్యలపై పరిశీలన చేస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. విచారణను ఏప్రిల్ 10కి వాయిదా వేసింది.
అది సీఎం బినామీ సంస్థ : కేటీఆర్
సీఎం రేవంత్‌రెడ్డికి చెందిన బినామీ కంపెనీ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రా ఓ 75 ఏండ్ల వృద్ధురాలిని వేధింపులకు గురిచేస్తున్నదని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు, ఇతర ఏజెన్సీల ద్వారా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదని ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. ఇదేనా మీ మొహబ్బత్‌కీ దుకాణ్ రాహుల్జీ అంటూ కాంగ్రెస్ అగ్రనేతను ప్రశ్నించారు. కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్ సంస్థకు బినామీదారుడు సీఎం రేవంత్‌రెడ్డేనని కేటీఆర్ ఇంతకుముందుగానే బట్టబయలు చేశారు. అందుకే ఆ సంస్థకు ఏకంగా రూ.6 వేల కోట్ల కాంట్రాక్టులు కట్టబెట్టారని మీడియా సమావేశంలో వెల్లడించారు. బినామీ వ్యవహారం బయటపడితే రాజకీయంగా రచ్చ అవుతుందనే భయంతోనే రేవంత్ ప్రభుత్వం ఫోన్‌ట్యాపింగ్, సిట్ విచారణ పేరుతో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.