హైదరాబాద్/బంజారాహిల్స్,అక్టోబర్ 24: దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్ ఇటీవల దక్కన్ సిమెంట్స్ కంపెనీ డైరెక్టర్ తలకు తుపాకి గురిపెట్టాడనే ప్రధాన ఆరోపణపై నిజాలు నిగ్గుతేల్చాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు శుక్రవారం జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఫిర్యాదుచేశారు. రాష్ట్ర ముఖ్యనేత ఇంటి వెనుకాల ఆయనకు షాడోగా గుర్తింపు ఉన్న రోహిన్‌రెడ్డి కార్యాలయంలో జరిగినట్టు ప్రచారంలో ఉన్న వ్యవహారంపై క్రిమినల్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టాలని మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్‌రెడ్డి తదితర నాయకులు జూబ్లీహిల్స్ పోలీసులను కోరారు. ముఖ్యనేతతోపాటు ఇద్దరు మంత్రులకు ప్రత్యక్ష సంబంధాలు ఉన్నట్టు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో దక్కన్ సిమెట్స్ కంపెనీ డైరెక్టర్‌ను బెదిరించడం వెనుక అసలు కథ ఏమిటో తేల్చాని ఫిర్యాదులో పేర్కొన్నారు.
‘దక్కన్ ప్రతినిధుల వ్యవహారంలో సుమంత్‌ది తప్పు అయితే రోహిన్రెడ్డిది కూడా తప్పే. రోహిన్‌రెడ్డి సీఎం ఇంటి వెనుక నుంచే వచ్చాడు. ఆరోజు గన్ వాడితే ఆ తుపాకి సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చారు. రోహిన్‌రెడ్డిని కూడా విచారించాలి’ అంటూ అక్టోబర్ 15న మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ మీడియా ఎదుట మాట్లాడారు. ఆమె వ్యాఖ్యల ఆధారంగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేయాలని బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. మంత్రి కొండా సురేఖ చెప్పినట్టుగా ఆ విషయం టీ కప్పులో తుఫాను కాదని స్పష్టంచేశారు. వారి వ్యక్తిగత విషయమైతే తుఫానో..జడివానో తమకు అవసరం లేదని, కానీ వారి మధ్య జరిగింది వాటాల పంచాయితీ అని, తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన గొడవ అని బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు.
‘కంపెనీ డైరెక్టర్‌ను రోహిన్‌రెడ్డి కార్యాలయానికి ఎవరు రప్పించారు? అదే సమయంలో అక్కడకు కొండా సురేఖ ఓఎస్డీ ఎందుకు వచ్చారు? ముఖ్యమంత్రి టేబుల్ మీద ఉండాల్సిన దక్కన్ సిమెట్స్ ఫైల్ రోహిన్‌రెడ్డి టేబుల్ మీదకు తెచ్చింది ఎవరు? ఈ తతంగం వెనుక ముఖ్యమంత్రి హస్తం ఉన్నదా?’ అనే అంశాల మీద దర్యాఫ్తు చేసి బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. పారిశ్రామికవేత్త కణత మీద తుపాకి గురిపెట్టారని, ఆ తుపాకి సీఎందే కావొచ్చని స్వయంగా మంత్రి కుమార్తె ఆరోపించిన నేపథ్యంలో పోలీసులే సుమోటోగా కేసు నమోదు చేయాల్సి ఉండెనని, కానీ పోలీసులు ఆ పని చేయకపోవడంతో తామే ఫిర్యాదు చేసినట్టు బీఆర్ఎస్ నాయకులు తెలిపారు.
ముఖ్యమంత్రి తన షాడో రోహిన్‌రెడ్డితో మాట్లాడుకోవాలని సూచించగా.. ముఖ్యమంత్రి ఇంటి వెనుకాలే ఉన్న రోహిన్‌రెడ్డి కార్యాలయంలో సమావేశం అయినట్టు సుస్మిత పటేల్ పూసగుచ్చినట్టు చెప్పారని బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు. దక్కన్ సిమెంట్స్ తరఫున కంపెనీ డైరెక్టర్, ముఖ్యనేత తరఫున రోహిన్‌రెడ్డి, కొండా దంపతుల ప్రతినిధిగా సుమంత్ హాజరయ్యారని బీఆర్ఎస్ నేతలు మీడియాకు వివరించారు. దాదాపు రెండు గంటలపాటు ఎవరి వాటా ఎంత అనే దాని మీదనే వాడివేడి చర్చలు జరిగాయని, సార్‌కు ఎంత వాటా ఇస్తున్నారో.. మా మేడమ్ వాటా కూడా అంతేనని సుమంత్ తెగేసి చెప్పినట్టు మీడియాలో కథనాలు వచ్చాయని పేర్కొన్నారు.
ఇంత జరిగినా ఇది టీ కప్పులో తుఫాను లాంటిదని చెప్పడం విడ్డూరమని మండిపడ్డారు. ఒకవేళ అటువంటి సంఘటన ఏదీ జరగకపోతే, అర్ధరాత్రి వేళ పోలీసులు మంత్రి కొండా సురేఖ ఇంటికి సుమంత్‌ను అరెస్టు చేయడం కోసం ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. మంత్రి కొండా సురేఖ పోలీసుల మందే తన ఓఎస్డీ సుమంత్‌ను వాహనంలో తీసుకొని పోలీస్స్టేషన్ల వెంట ఎందుకు తిరిగారని నిలదీశారు. వాటాల సెటిల్మెంట్ కోసమే అర్ధరాత్రి వేళ పోలీసులు మంత్రి ఇంటికి వెళ్లారా? అని ప్రశ్నించారు. ఇవన్నీ వ్యక్తిగత విషయాలు కాదని, ప్రజలకు సంబంధించిన అంశాలని, పోలీసులు క్రిమినల్ కేసులు నమోదుచేయాలని డిమాండ్ చేశారు.