Telangana | హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): వైద్యారోగ్య శాఖలో అస్తవ్యస్త బదిలీల పరిణామాలు వైద్యులు, సిబ్బందిని పట్టిపీడిస్తూనే ఉన్నాయి. బదిలీ అయిన త ర్వాత జీతాలు రావడంలేదని వైద్యులు, సిబ్బంది ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రభు త్వం జూలైలో సాధారణ బదిలీలను చేపట్టిం ది. వైద్యారోగ్య శాఖలో సీనియార్టీ జాబితా, వెకెన్సీ జాబితా, బదిలీల మినహాయింపు ప త్రాల విషయంలో తీవ్ర అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి.
కాలక్రమేణా ఈ అంశం మరుగునపడినా.. విచ్చలవిడిగా చేసిన బదిలీల కారణంగా వైద్యులు, సిబ్బంది ఇప్పటికీ అవస్థలు పడుతూనే ఉన్నారు. తమకు కొత్త స్టేషన్ (జిల్లా/ప్రాంతం)లో చేరిన తర్వాత జీతాలు అందడంలేదని వైద్యులు, నర్సింగ్ ఆఫీసర్లు, సిబ్బంది వాపోతున్నారు. కొందరికి బదిలీ అయినప్పటి నుంచి జీతాలు అందకపోగా, మరికొందరికి బదిలీ అయిన నెలలో కొంత జీతం పెండింగ్లో ఉన్నదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. వైద్యసిబ్బందిలో చాలా వరకు కొత్త స్టేషన్కు వెళ్లిన తర్వాత జీతం రాలేదని చెప్తున్నారు. ‘హైదరాబాద్ నుంచి సిద్దిపేట జిల్లాకు బదిలీ అయ్యాను.
ఇప్పటివరకు జీతం రాలేదు’ అని ఓ డాక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. మరికొందరికి బదిలీ అయిన నెలలో.. బదిలీకి ముందు పనిచేసిన రోజుల వరకే జీతం వచ్చిందని, కొత్త స్టేషన్లో చేరిన తర్వాత ఆ నెలలోని మిగతా రోజులకు జీతం పడలేదని చెప్తున్నారు. ‘నేను హైదరాబాద్ నుంచి మేడ్చల్ జిల్లాకు జూలై మూడో వారంలో బదిలీపై వెళ్లాను. జూలైలో మొదటి మూడు వారాలకు హైదరాబాద్లో జీతం వచ్చింది. కానీ మిగతా వారం రోజులకు సంబంధించిన వేతనం మేడ్చల్ జిల్లాలో రాలేదు’ అని ఓ నర్సింగ్ ఆఫీసర్ వాపోయారు. ఇలా జీతాలు పెండింగ్లో ఉండటంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు.