హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): ఉస్మానియా దవాఖాన భవన పరిస్థితి బాగోలేదని, మరమ్మతులు చేస్తే జీవనకాలం పెరుగుతుందని, మరమ్మతుల తర్వాత దవాఖానను అందులో కొనసాగించవద్దని ప్రభుత్వం నియమించిన ప్రత్యేక కమిటీ హైకోర్టుకు తెలిపింది. హైదరాబాద్ ఐఐటీ డైరెక్టర్, ప్రభుత్వ అధికారులు, పురావస్తు శాఖ స్ట్రక్చరల్ ఇంజినీరుతో కూడిన కమిటీ నివేదిక ఇచ్చిందని ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ చెప్పారు. ఉస్మానియా భవనాన్ని కూల్చివేసి తిరిగి నిర్మించాలని కొందరు, భవనాన్ని పరిరక్షించాలని మరికొందరు వేర్వేరుగా దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాల(పిల్)పై మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ భాసర్రెడ్డితో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ల తరపున నళిన్‌కుమార్ వాదిస్తూ.. 2010లోనే ప్ర భుత్వం చారిత్రక భవన పరిరక్షణకు జీవో ఇచ్చి..ఓపీ, ఇతర పరిపాలనా సేవలకు వినియోగించాలని సూచనలు చేసిందన్నారు. 6 ఎకరాల్లో రూ.200 కోట్లతో 12 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నూతన భవనాన్ని నిర్మించాలని నిర్ణయించిందన్నారు. ఈ లోపు రాష్ట్ర విభజన జరగడంతో జీవో అమలుకు నోచుకోలేదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం కచ్చితమైన ప్రతిపాదనలతో ఫిబ్రవరి 7లోపు నివేదిక అందజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.