హైదరాబాద్, నవంబర్ 11(నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి రియల్ఎస్టేట్ రంగం నేలచూపులు చూస్తున్న నేపథ్యంలో టీజీఐఐసీ నిర్వహిస్తున్న భూముల వేలంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్క నెలలోనే ఎకరాపై దాదాపు రూ.13 కోట్ల వరకూ ధర తగ్గడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. టీజీఐఐసీ తాజాగా నిర్వహించిన రాయదుర్గ్ పాన్‌మక్తా భూముల వేలంలో ఎకరాకి రూ.164 కోట్ల ధర పలికింది. అదే ప్రాంతంలో గత నెలలో వేలం నిర్వహించగా ఎకరా భూమి రూ.177 కోట్లకు అమ్ముడుపోవడం విశేషం. ఒకే ప్రాంతంలో నెల రోజుల్లోనే ఇంత వ్యత్యాసం రావడం రియల్ఎస్టేట్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది.
టీజీఐఐసీ సోమవారం రాయదుర్గ్ పాన్మక్తాలో రెండు ప్లాట్లకు వేలం నిర్వహించగా, గజానికి రూ.3,40,000 చొప్పున ధర పలికింది. ఈ రెండు ప్లాట్లు కలుపుకొని 4,700 గజాలు (ఎకరాకు సుమారు 140 గజాలు తక్కువ) కాగా, దీనిపై టీజీఐఐసీకి రూ.160 కోట్ల ఆదాయం సమకూరింది. దీన్నిబట్టి ఎకరా ధర రూ.164 కోట్లుగా చెప్పవచ్చు. నాలెడ్జ్సిటీగా పేరుగాంచిన పాన్‌మక్తా ప్రాంతంలో గత అక్టోబర్‌లో టీజీఐఐసీ వేలం నిర్వహించగా, ఎకరా భూమికి రూ.177 కోట్ల ధర పలికింది. దీనిపై టీజీఐఐసీ అధికారులు స్పందిస్తూ.. తాజా వేలంలో ఎకరా భూమి రెండు ప్లాట్లుగా విడివిడిగా ఉండటం వల్లే బిల్డర్ల మధ్య పోటీ తగ్గి ధర తగ్గిందని, అంతేతప్ప నగరంలో భూముల విలువ పడిపోవడంలేదని చెప్తున్నారు. 2017లో ఇదే ప్రాంతంలో వేలం నిర్వహించగా గజం ధర రూ.88,000 మాత్రమే పలికిందని, దాంతో పోల్చుకుంటే ఇప్పుడు పలుకుతున్న ధర ఎంతో అధికమని సమర్ధించుకుంటున్నారు.
హైదరాబాద్ వెస్ట్‌జోన్ ప్రాంతంలో భూముల ధరలు పెరగడమే తప్ప తగ్గడం అనేది ఉండదు. గత అనుభవాల ద్వారా ఇది స్పష్టమవుతున్నది. పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక్క హైదరాబాద్‌లోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా భూముల ధరలు పెరిగాయి. పదేండ్లపాటు దేశంలో ఎక్కడా లేనివిధంగా మన రాష్ట్రంలో భూముల ధరలు పెరగడం విశేషం. అయితే, రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు వచ్చినప్పటి నుంచి రియల్ఎస్టేట్ రంగం పూర్తిగా పడిపోయింది. ముఖ్యంగా వ్యవసాయ భూములు కొనే నాథుడే కరువయ్యాడు. హైదరాబాద్‌లో సైతం వేల సంఖ్యలో అపార్ట్మెంట్లు అమ్ముడుపోవడంలేదని వివిధ సర్వేలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం భూముల విక్రయం ద్వారా రియల్ఎస్టేట్ రంగం స్థిరంగా ఉన్నదనే సందేశం ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నదని పలువురు చెప్తున్నారు. మొత్తం మీద వేలంలో భూముల ధర హెచ్చుతగ్గులపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.